
సంస్కృతిని కాపాడుకోవడంలో వారి పాత్ర కీలకం
ఆదివాసీ దినోత్సవంలో భద్రాచలం ఐటీడీఏ పీవో
భద్రాచలం, ఆగస్టు 9: సంస్కృతీ సంప్రదాయాలను పాటించడంలో, వాటిని కాపాడుకోవడంలో గిరిజనుల పాత్ర అమోఘమని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆదివాసీ అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు, ఘంటం, మల్లుదొర వంటి ఎందరో ఆదివాసీ నేతల ప్రాణత్యాగాల ఫలితంగా ఆదివాసీల హక్కులు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఆదివాసీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పడిందన్నారు. భద్రాచలం ఏరియా ఆదివాసీలు విద్యలో ముందున్నారని అన్నారు. గిరిజనులకు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు పూనెం కృష్ణ దొర, పూనెం వీరభద్రం, పాయం రవివర్మ, గిరిజనాభ్యుదయ సంఘం నాయకులు కొర్సా చిట్టిబాబు దొర తదితరులు పాల్గొన్నారు.