ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న ఆధార్ సర్వర్లు గురువారం ఒక్కసారిగా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న ఆధార్ సర్వర్ల ద్వారా.. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి, చేసే వారికి సాక్షుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు. అయితే గురువారం ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు వచ్చి సబ్ రిజిస్ట్రార్లు ఆధార్ సర్వర్లను ఓపెన్ చేయగా కొద్దిసేపు పనిచేశాయి. అయితే రిజిస్ట్రేషన్లు మాత్రం మొదటి గంటలో ఏమీ కాలేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే ఈ సర్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా మొరాయించాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వర్లు పని చేయకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల్లో రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, ఖమ్మం రూరల్, వైరా, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కల్లూరుల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లేమీ కాలేదు. అలాగే భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లావాదేవీలు స్తంభించాయి.
దీంతో వందలాది మంది సర్వర్ పనిచేస్తుందన్న ఆశతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే పడిగాపులు కాశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి సాయంత్రం వెనుదిరిగారు. సర్వర్లో వచ్చిన సాంకేతిక లోపం ఏమిటో అధికారులు వివరించకపోవడం, ఎప్పుడు పనిచేస్తుందో స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాలతో వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రిజిస్ట్రేషన్దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 250 రిజిస్రేషన్లు జరుగుతుంటాయి. ఈ రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో ప్రతిరోజూ రూ.1.50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. కాగా, గురువారం ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం నిలిచిపోయినట్లయింది. అయితే సర్వర్ సమస్య తమ పరిధిలోనిది కాదని, ఎప్పుడు పని చేయడం ప్రారంభిస్తుందో చెప్పలేమని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పష్టం చేశారు.