రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. “మా రుణాలు మాఫీ కాలేదు మహాప్రభో” అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏమిచేయాలో తోచక అయోమయంలో ఉండిపోయారు. రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల కొర్రీలు పెట్టి తమకు కర్రుతో వాతపెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని లక్షల అప్పు ఉంటే ఏంటీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ రూ.2 లక్షలు మాఫీ చేయొచ్చు కదా! అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ ఉండదని కాంగ్రెస్ చెప్పలేదు కదా అంటున్నారు. పైగా ఉన్న అప్పు కడితే రుణమాఫీ చేస్తారో లేదో అంటూ అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలాయపాలెం, ఆగస్టు 19 : తిరుమలాయపాలెం మండలంలో 50శాతం రైతులకు కూడా రుణమాఫీ కాకపోవడం గమన్హారం. మండలంలో ఏపీజీవీబీ తిరుమలాయపాలెం, సుబ్లేడు, పాతర్లపాడు, పిండిప్రోలు ఐవోబీ, యూనియన్ బ్యాంక్ బీరోలు, కెనరా బ్యాంకు ఖమ్మంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన 15,179 మంది రైతులకు రూ.123.86 కోట్లు అప్పు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు మూడు విడతలుగా 7,226 మంది రైతులకు రూ.61.33 కోట్లు మాఫీ చేసింది.
మండలంలోని బ్యాంకుల్లో ఇంకా 7,953 మంది రైతులకు రూ.62.53 కోట్లు అప్పు మాఫీ కాలేదు. వివిధ బ్యాంకుల్లో రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులకు ఒక్కరికి సైతం రుణమాఫీ కాలేదు. ఇప్పుడేమో రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పు కడితే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పటివరకు కట్టాలి, ఎప్పుడు మాఫీ చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం పట్ల అన్నదాతల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలన్నింటినీ తొలిగించి ఎన్ని లక్షల అప్పు అనేది కాకుండా ప్రతి రైతుకూ రూ.2 లక్షలు మాఫీ చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నేను గానుగపాడు సహకార సంఘంలో సభ్యుడిని. నాకు రుణమాఫీ కాలేదు. మా సొసైటీలో 2,850 మంది రైతులకు గాను మూడు విడతల్లో కలిపి కేవలం 850 మందికే రుణమాఫీ అయింది. మిగిలిన 2,000 మందికి రుణమాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. రైతులందరికీ రుణమాఫీ చేయడం లేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. రుణమాఫీ కాకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-భూపతి రమేశ్, రైతు, రావికంపాడు, చండ్రుగొండ
గుంపెన సొసైటీలో నేను పంట రుణం తీసుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీలో నా పంట రుణం కూడా మాఫీ కాలేదు. మా గ్రామంలో కొంతమందికే ఈ ప్రభుత్వంలో రుణమాఫీ అయింది. ఎక్కడ చూసినా, ఎవరిని పలుకరించినా రైతులు తమ రుణాలు మాఫీ కాలేదనే చెబుతున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణ విముక్తి కల్పించాలి. ఏజెన్సీ ఏరియాలో పహాణీలతో రుణాలు పొందిన రైతుల పంట రుణాలు కూడా మాఫీ చేయాలి.
– చీదెళ్ల పవన్‌కుమార్, రైతు, చండ్రుగొండ
కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు మానేసి ప్రతి రైతుకూ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రూ.2 లక్షలకుపైగా ఉన్నవారికి రుణమాఫీ చేయమని చెప్పలేదుగా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకమారు రైతుకు ఎన్ని లక్షలు అప్పు ఉన్నా రూ.లక్ష మాఫీ చేసింది. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.2 లక్షలు మాఫీ చేస్తే బాగుంటుంది. లేకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. నాకు, నా భార్య లలితకు కలిపి రూ.2.69 లక్షల అప్పు ఉంది. మాకు రుణమాఫీ రాలేదు.
– నీరుడు లాజరస్, రైతు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి, రఘునాధపాలెం, టీ.పాలెం మండలం
రైతులకు రూ.2 లక్షలకు పైగా అప్పు ఉంటే మాఫీ కాదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పలేదు. పైగా ఉన్న డబ్బులు కట్టుకుంటేనే మాఫీ వస్తుందని ఎవరైనా చెబితే మేము ఆ పని చేసేవాళ్లం. మాకు ఇద్దరికి కలిసి రూ.2.24 లక్షల అప్పు ఉంది. మాఫీ కాలేదు. ఏమీ చేయాలో తోచడం లేదు.
– దారావత్ సోమ్లా, రైతు, జోగులపాడు, టీ.పాలెం మండలం
నాకు రూ.2.10 లక్షల అప్పు ఉంటే రూ. 10,000 అప్పు కట్టి రూ.2 లక్షలు ఉంచాను. బ్యాంకు వారు మరో రూ.2000 వడ్డీ జమ చేశారు. దీంతో నా అప్పు రూ.2 లక్షల రెండు వేలు కావడంతో రుణమాఫీ కాలేదు. నాలాంటి రైతులు ఎందరో ఉన్నారు. బ్యాంకు అధికారుల వైఖరి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
– రావిళ్ల నాగరాజు, రైతు, పిండిప్రోలు, టీ.పాలెం మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు బాగోలేదు. అనేక మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేసింది మరొకటి. అర్హులందరికీ రుణాలు మాఫీ చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదు. ప్రతి రైతుకూ రూ.2 లక్షలు మాఫీ చేయాలి.
– చామకూరి రవి, రైతు, పిండిప్రోలు, టీ.పాలెం
మా పిండిప్రోలు గ్రామంలో 30మందికి కూడా రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి రుణాలు మాఫీ చేయలేదు. రైతుకు అప్పు ఎంతున్నది అనేది కాకుండా ప్రతి రైతు కుటుంబానికి కాంగ్రెస్ హామీ మేరకు రూ.2 లక్షల మాఫీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పు కట్టినా మళ్లీ మాఫీ వస్తుందని గ్యారంటీ లేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టంగా కటాఫ్ తేదీతో ప్రకటన చేయాలి.
– రామనబోయిన వెంకటేశ్వర్లు, రైతు, పిండిప్రోలు, టీ.పాలెం మండలం