ఖమ్మం, ఫిబ్రవరి 16 : ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేశానని, తాజాగా భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం తన కోటా నుంచి రూ.1,17,50,500 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేరొన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నిధులు కేటాయించానని తెలిపారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలకు చెందిన గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కల్వర్టులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీ నిర్మాణాలకు తన కోటా నుంచి నిధులు మంజూరు చేశానని చెప్పారు. త్వరలోనే ఆయా పనులకు శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి తన ఎంపీ నిధులను పెద్ద ఎత్తున కేటాయించి ఖర్చు చేస్తున్నట్లు నామా తెలిపారు.