
ముగిసిన ఆషాఢ బోనాలు
చివరి రోజు వెల్లివిరిసిన భక్తి పారవశ్యం
గ్రామ దేవతలకు మహిళా భక్తుల నైవేద్యం
గ్రామాల్లో పండుగ సందడి
కొత్తగూడెం కల్చరల్/ భద్రాచలం/ ఏన్కూరు, ఆగస్టు 8: ‘కరుణించమ్మా.. ముత్యాలమ్మా..’ అంటూ భక్తులు అమ్మవారికి వేడుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాస బోనాలు ఆదివారంతో ముగిశాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని బూడిదగడ్డలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న బోనాల జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అమ్మవారికి బోనం సమర్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, నియోజకవర్గ అభివృద్ధికి దయ చూపించాలని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉపాసకుడు నరేంద్ర భవానీ స్వామి ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పట్టువస్ర్తాలు బహూకరించారు. పూలమాల వేసి ఆహ్వానం పలికారు. చివరిరోజు ఆలయంలో ఉదయం 6 గంటలకు మంగళవాయిద్యాలు, 9 గంటల నుంచి పీఠ పూజలు, అమ్మవారి అర్చనతోపాటు చండీ సప్తశతీ హోమం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, ఆశీర్వచనము తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. చండీ సప్తశతీ హోమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి భద్రాచలం మండలం, భద్రాద్రి మహిళా మండలి ఆధ్వర్యంలో జాగృతి నాయకురాళ్లు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఏన్కూరు మండలం తూతకలింగన్నపేటలోనూ బోనాల వేడుకలు నిర్వహించారు. గ్రామంలో మహిళలు.. ముత్యాలమ్మ, మైసమ్మ, గంగమ్మతల్లులకు, బొడ్రాయికి, ఆంజనేయస్వామికి అభిషేకం చేశారు.