
ఖమ్మం, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని కోకాపేటలో మున్నూరుకాపులకు కేటాయించిన 5 ఎకరాల భూమిలో నిర్మించనున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) భూ విరాళాన్ని ప్రకటించారు. తమ గాయత్రి గ్రానైట్స్ సంస్థల తరఫున భవన నిర్మాణం కోసం రూ.కోటి విరాళం అందచేస్తానని అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ టూరిజం ప్లాజాలో మున్నూరుకాపు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నేతలు హాజరయ్యారు. మున్నూరుకాపు సంక్షేమ సంఘం అపెక్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న గాయత్రి రవి.. ఈ సమావేశంలో విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల, కేకే, ఇతర నేతలంతా గాయత్రి రవిని అభినందించారు.