
వచ్చే ఏడాదిలో 76 వేల ఎకరాల లక్ష్యం
రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు సిద్ధం చేస్తాం..
కొత్తగా నాలుగు జిల్లాల్లో విస్తరణ
ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
అశ్వారావుపేట, నవంబర్ 7 : రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు విస్తరణకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, ఇందుకు అవసరమైన రాయితీ పథకాలు అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఏడాది 78వేల ఎకరాల్లో సాగు విస్తరణకు 40లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని నారంవారిగూడెం డివిజనల్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న కాలంలో మొక్కల కొరత అధిగమించేందుకు కొత్త నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ భూములను కౌలుకు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే ఇతర రాష్ర్టాల కంటే రైతులకు అత్యధిక ధర, ఓఈఆర్ అందిస్తున్న ఘనత టీఎస్ ఆయిల్ఫెడ్దేనని స్పష్టం చేశారు. రైతుల్లో ఆయిల్‌పాం సాగు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మొక్కల డిమాండ్ పెరుగుతోందని అన్నారు. కొత్తగా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలను ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించిందని, ఈ జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల వరకు ఆయిల్‌పాం సాగుకు భూములు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా రవాణా చార్జిలను పెంచామని, గతంలో కంటే స్లాబ్‌ల పరిధిని పెంచామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చార్జీల కంటే తెలంగాణ రైతులకు అదనంగా 20 నుంచి 25శాతం ఎక్కువ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. గెలల దిగుమతిలో రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త ప్లాట్ ఫాంలు, వేయింగ్ యంత్రాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీ సామార్ధ్యాన్ని 30 నుంచి 60 టన్నులకు విస్తరిస్తున్నామని, ఇందుకు రూ.16 కోట్ల అంచనాతో టెండర్లు జారీ చేశామని, ఈటీపీ టెండర్‌ను రద్దు చేసినట్లు వివరించారు. ఓఈఆర్ శాతాన్ని ఫ్రైస్ ఫిక్సేషన్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఆంధప్రదేశ్ ప్రైవేట్ కంపెనీలు తెలంగాణలోని ఆయిల్‌పాం గెలలను అక్రమంగా సేకరిస్తున్నాయని, వాటిని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్‌ఫెడ్ సంస్థను సంరక్షించుకోవాల్సిన బాధ్యత రైతులకు కూడా ఉందని గుర్తు చేశారు.
రైతు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రామకృష్ణారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. డివిజనల్ కార్యాలయంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లిఖితపూర్వకంగా వినతిపత్రాలను స్వీకరించారు. ఓఈఆర్, రవాణా చార్జీల పెంపు అంశాలను రైతులకు వివరించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా నాణ్యతతో కూడిన మొక్కలు సిద్ధం చేయాలని చెప్పారు. అక్కడ నుండి అశ్వారావుపేట ఫ్యాక్టరీని సందర్శించారు. గెలల క్రషింగ్, ఆయిల్ రికవరీ, గెలల దిగుబడిని పర్యవేక్షించారు. ఆయన వెంట డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, క్షేత్ర సహాయకులు ఉన్నారు.