
డిగ్రీ ప్రవేశాల్లో దూసుకెళ్తున్న ప్రభుత్వ కళాశాలు
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ హవా
విద్యార్థుల చూపు.. ప్రభుత్వ కళాశాలల వైపు
ప్రైవేట్‌లో 50శాతం నిండని సీట్లు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 7: డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సత్తా చాటుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌కు దీటుగా విద్యను అందిస్తుండడంతో విద్యార్థులు సర్కారు కళాశాలల బాట పడుతున్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రైవేట్ నుంచి సర్కారు వైపు మళ్లుతున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఆన్లైన్ విధానం దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు అత్యధిక సీట్లతో దూసుకెళ్తున్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థలోని మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనతో డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సత్తా చాటుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో సర్కార్ కళాశాలలు కుంటుపడగా.. ప్రైవేట్ కళాశాలలు మాత్రం కళకళలాడాయి. తెలంగాణ ప్రభుత్వ సంస్కరణలు సర్కార్ కళాశాలల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సులు, మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ డిగ్రీ విద్యపై అంచనాలు పెంచారు. దీంతో 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఆన్లైన్లో ‘దోస్త్’ మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించి చేపట్టిన సీట్ల అలాట్మెంట్ ప్రక్రియలో ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక స్థ్ధాయిలో సీట్లు భర్తీ అయ్యాయి.
బకెట్ విధానంతో పెరిగిన అవకాశాలు..
ఉన్నత విద్యారంగంలో కీలకమైన డిగ్రీ విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ప్రవేశాల దగ్గర్నుంచి వారికిష్టమైన కళాశాల, ఇష్టమైన గ్రూప్‌లో చదవడానికి అవకాశాలు ‘బకెట్ విధానంతో’ మెరుగయ్యాయి. గతంలో డిగ్రీలో చేరే విద్యార్థులు చేరదల్చుకున్న కళాశాలల్లో విడివిడిగా దరఖాస్తు చేసుకునేవారు. అదే సమయంలో బీఏ, బీఎస్సీ, బీకాం నిర్దేశిత సంప్రదాయ గ్రూపుల్లో నచ్చినా, నచ్చకపోయినా అదే గ్రూపుల్లో చేరాల్సి వచ్చేది. దీంతో ‘బకెట్’ విధానాన్ని అమలు చేస్తున్నది. గతంలో డిగ్రీలో చేరితే కళాశాలలో ఉన్న మూడు సబ్జెక్ట్‌లను కచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు విద్యార్థి చేరిన కళాశాలలో తనకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ లేకుంటే దానిని ఆన్లైన్ ద్వారా చదువుకోవచ్చు. దీనినే బకెట్ విధానంగా పిలుస్తున్నారు.
సీట్ల భర్తీ దాదాపు పూర్తి
ఖమ్మం జిల్లా పరిధిలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. 40కిపైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మంలో రెండు డిగ్రీ కళాశాలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల, ఒక అటానమస్‌గా ఉన్నాయి. మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లిల్లో ఒక్కో కళాశాల చొప్పున ఉన్నాయి. వీటిల్లో 2,252 సీట్లు భర్తీ అయ్యాయి. డిగ్రీ ఫస్టియర్‌లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్‌లో 1,500 సీట్లు ఉండగా.. 1500 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 296 సీట్లు, సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో 326 సీట్లు, నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో, మధిర డిగ్రీ కళాశాలలో 81 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఖమ్మంలోని ఓ మూడు కళాశాలల్లో మాత్రం 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కళాశాలలు ప్రవేశాలకు నగదు ఇచ్చినా విద్యార్థులు ఆయా ఆసక్తి చూపలేదని అలాట్మెంట్ తర్వాత స్పష్టమవుతున్నది.
అటానమస్ అదరహో..
తెలంగాణలో రెండో అతిపెద్ద ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (అటానమస్) డిగ్రీ కళాశాలగా ఉన్నత విద్యారంగంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ఖమ్మం విజ్ఞాన భాండాగారంగా భాసిల్లుతున్నది. ఉమ్మడి జిల్లాలో మిగతా ప్రభుత్వ కళాశాలల సమన్వయ కేంద్రంగా కీలకపాత్ర పోషిస్తున్నది.