
అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న ఖమ్మం జిల్లా
క్షేత్రస్థాయిలో పథకాల అమలుకు కృషిచేశాం
జడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ లింగాల కమల్రాజు
రైతు వేదికల వద్ద ఏఈవోల వివరాలు ఉంచాలి: కలెక్టర్
మామిళ్లగూడెం, ఆగస్టు 7: అభివృద్ధిలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. కరోనాను జయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలకపాత్రను పోషించారని అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ప్రగతి, నిర్దేశిత లక్ష్యాల సాధన, జిల్లా ప్రగతి తదితర అజెండా అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జడ్పీ పాలకవర్గం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో ఏట అడుగు పెట్టిందని అన్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందించడంలో కీలకంగా పనిచేశామన్నారు. పాలకవర్గం ఏర్పడిన కొద్ది నెలలకే కరోనా విపత్తు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో కరోనాను నివారించగలిగామన్నారు. సమావేశంలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు కరోనా వ్యాక్సినేషన్ క్షేత్రస్థాయిలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి చైర్మన్ సమాధానమిస్తూ.. కొవిడ్ నియంత్రణకు సత్వర చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కోరారు. రైతు వేదికల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి సంబంధిత అధికారుల పేర్లు వివరాలను తెలపాలని, ఏఈవోలు రైతువేదికల వద్ద అందుబాటులో ఉండే సమయం, ఫోన్ నెంబర్లు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో రైతు వేదికల్లో రైతులకు వ్యవసాయ అధికారులు తగు సలహాలు సూచనలతో అవగాహన కల్పించాలని కోరారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బీ.రాహుల్, ఇన్చార్జి జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.