
రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం
నారు, నాటు లేకుండా వరి సాగు
17 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం
అవగాహన పొందుతున్న పొరుగు జిల్లాల రైతులు
టీ వెంకటాపురంలో 350 ఎకరాల్లో వరి సాగు
ఖమ్మం వ్యవసాయం/ కల్లూరు, ఆగస్టు 6: కరివేద సాగులో ఖమ్మం జిల్లా టాప్‌లో నిలిచింది. ఒక గ్రామంలో 100 ఎకరాలతో మొదలై సాగు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 21 మండలాలకు విస్తరించింది. ఏటా 30 వేల ఎకరాల్లో సాగు అవుతుంది. గడిచిన యాసంగిలో రికార్డు స్థాయిలో కరివేద సాగు చేయగా.. మంచి ఫలితాలొచ్చాయి. దీంతో మిగిలిన రైతులూ ఈ సీజన్లో ఇదే పద్ధతిని అనుసరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 33 జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశారు. కేవలం ఖమ్మం జిల్లాలో రైతులు 17 వేల ఎకరాల్లో సాగు చేసి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు.
కరివేద సాగుతో అనేక ప్రయోజనాలున్నాయని తెలుసుకున్న పొరుగు జిల్లాల రైతులు కొద్ది రోజుల నుంచి అవగాహన పొందేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చి ఇక్కడి రైతుల పొలాలను పరిశీలిస్తున్నారు. కరివేద పద్ధతిని మరింత ప్రోత్సహించేందుకు మంత్రి అజయ్‌కుమార్ ఇటీవల స్వయంగా రైతులు, అధికారులతో కలిసి వెళ్లి పొలాల్లో విత్తనాలను వెదజల్లారు. కరివేద సాగు వల్ల కలిగే ప్రయోజనాలను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నాలుగు రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులతో ఖమ్మం జిల్లా వచ్చి కరివేద పొలాలను సందర్శించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు జరుగుతోంది. ఇందులో కేవలం ఖమ్మం జిల్లాలోనే 17 వేల ఎకరాలు ఉన్నాయి.
విస్తరించిన సాగు
సీజన్ ఆరంభంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడంతో జిల్లా కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల సూచనలు పాటించిన జిల్లా రైతులు దాదాపు 10 వేల ఎకరాలు ఈ పద్ధతిలో సాగు చేశారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు గొర్ల సత్తిరెడ్డితో ప్రారంభమైన ఈ సాగు ఇప్పుడు వేలాదిమంది రైతులకు అదర్శమైంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 17,791 ఎకరాల్లో కరివేద పద్ధతిలో వరి సాగవుతోంది. వేంసూరు మండలంలో రికార్డు స్థాయిలో 7,869 ఎకరాలు, పెనుబల్లిలో 2,243, తల్లాడలో 1,505, కల్లూరులో 1,777, సత్తుపల్లిలో 970, వైరాలో 845, నేలకొండపల్లిలో 581, ఏన్కూరులో 473, తిరుమలాయపాలెంలో 393, ముదిగొండలో 234, కూసుమంచిలో 209, మిగిలిన మండలాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో ఈ పద్ధతి ద్వారా వరి సాగవుతోంది.
తాళ్లూరు వెంకటాపురంలో 350 ఎకరాల సాగు
కరివేద సాగు పద్ధతిలో కల్లూరు మండలంలోని తాళ్లూరు వెంకటాపురం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రధానంగా పెట్టుబడులు తగ్గించుకోవడంపై ఇక్కడి రైతులు దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కరివేద పద్ధతి వైపు మళ్లారు. పోచవరం సొసైటీ అధ్యక్షుడు, గ్రామ రైతు నర్వనేని పెద్ద అంజయ్య ప్రోత్సాహంతో గ్రామంలోని ఊరచెరువు కింద 350 ఎకరాల్లో రైతులందరూ వడ్ల గింజలు వెదజల్లి సాగు చేస్తున్నారు.
పెట్టుబడి తక్కువ.. సమయం ఆదా..
వెదజల్లే పద్ధతికి, నాటు వేసే పద్ధతికి మధ్య వ్యత్యాసం కన్పిస్తోంది. ఒక ఎకరాకు రూ.7 వేలు పెట్టుబడి ఆదా అవుతుంది. వెదజల్లే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. అదే నారుపోసే పద్ధతిలో అయితే 30 కిలోలు అవసరమవుతాయి. ఇక్కడ రూ.300 ఆదా అవుతాయి. నాటువేసేందుకు కూలీల ఖర్చు రూ.4500, కలుపు తీసేందుకు కూలీల ఖర్చు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చూ తగ్గినట్లే.
విశేష ఆదరణ వస్తోంది
వెదజల్లే పద్ధతికి రైతుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. కరివేద పద్ధతిలో ఖమ్మం జిల్లానే రాష్ట్రంలో ముందువరుసలో ఉంది. జిల్లా రైతులు విజయవంతంకావడంతో పొరుగు జిల్లాల రైతులు సైతం పంట పొలాలను సందర్శించి రైతుల అనుభవాలను అడిగితెలుసుకుంటున్నారు. వచ్చే యాసంగిలో దాదాపుగా 50 వేల ఎకరాల్లో ఈ విధానంలో వరి సాగయ్యే అవకాశం ఉంది.
-ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
మంచి ఫలితాలు పొందుతున్నారు..
నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా వరిసాగు చేసిన రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. దీంతో ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. సకాలంలో సాగు మొదలు పెట్టేందుకు, కూలీల కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. చీడపీడల బెడద లేకపోవడంతో రైతులకు పెట్టుబడి కలిసి వచ్చినట్లవుతుంది.
-డాక్టర్ హేమంత్‌కుమార్, వైరా కేవీకే కోఆర్డినేటర్
వెదజల్లే పద్ధతే సులువు..
ఊరచెరువు కింద నాకున్న 50 ఎకరాలతోపాటు గ్రామంలోని రైతులందరూ కలిసి మరో 300 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగును చేపట్టాం. ఈ పద్ధతి చాలా సులువుగా ఉంది. శ్రమ తక్కువ. దిగుబడి ఎక్కువ. కూలీల ఖర్చూ నామమాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు కూడా దొరకకపోవడంతో రైతులు ఈ కరివేద పద్ధతి సాగుతో ముందుకెళుతున్నారు.
-నర్వనేని పెద్ద అంజయ్య, తాళ్లూరు వెంకటాపురం