
నూతన జోన్ల వారీగా పోస్టుల విభజన
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
జిల్లాస్థాయి కొలువుల్లో 95శాతం స్థానికులకే..
ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు సులభం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
మామిళ్లగూడెం, ఆగస్టు 7: రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ రాష్ట్రంలో జోన్లు, మలీ ్టజోన్లు, జిల్లా స్థాయిలో పోస్టులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 87 ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖల్లో పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించి సీఎస్ సోమేశ్‌కుమార్ వివరాలను విడుదల చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ వ్యవస్థను సీఎం కేసీఆర్ గాడిలో పెడుతూ నూతన జోనల్వ విధానానికి నాంది పలికారు. నూతన విధానంపై ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ మేరకు గెజిట్ విడుదలైంది. దీనికి అనుబంధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జూన్ 30న ప్రకటన విడుదల చేశారు. తాజాగా పోస్టుల విభజన ఉత్తర్వుల ప్రకారం నూతన జోనల్ విధానంలో జిల్లా స్థాయి ఉద్యోగాలు ఇక నుంచి 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. మరోవైపు ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు సులభతరం కావడం, ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశమూ ఏర్పడింది.
వీడిన చిక్కులు..
పోలీస్‌శాఖ నియామకాలు, బదిలీలకు మల్టీ జోన్-1లో భద్రాద్రి-4జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉన్నాయి. ఇతర ప్రభుత్వ కొలువులకు మల్టీ జోన్-1లో భద్రాద్రి జోన్-4లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కొలువుల క్యాడర్ విభజన, జోన్ల ఆమోదం ఒక కొలిక్కి రావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జిల్లాల వారీగా నియామకాలు జరుగనుండడంతో సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జోన్ల వారీగా, మల్టీ జోన్ల వారీగా నియామకం, బదిలీలు పోస్టుల విషయంలో చిక్కులు తొలగడంతో తదుపరి పరిణామాలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
పోస్టుల విభజన ఇలా..
నూతన ఉత్తర్వుల ప్రకారం 87 ప్రధాన శాఖలు, వాటి అనుబంధ శాఖలలో పోస్టుల విభజన జరిగింది. పోలీస్ శాఖ పరిధిలోని జిల్లా స్థాయిలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారు ఆయా జిల్లాలు, జూనియర్ అసిస్టెంట్ నుంచి స్వీపర్, వాచ్మెన్ స్థాయి పోస్టుల వరకు జిల్లా క్యాడర్లో ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు, ఎస్సైలుగా ఎంపికైన వారు జోన్లలో పని చేయాల్సి ఉన్నది. మల్టీజోన్ల పరిధిలో ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు, డీఎస్పీ క్యాడర్ అధికారులు, ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, జిల్లా రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, కార్పొరేట్ సబ్ రిజిస్ట్రార్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో, ఏవో వంటి పోస్టులు మల్టీ జోన్లలో ఉన్నాయి. వీటితో పాటు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-2, గ్రేడ్-3, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్-2, పంచాయతీ లైన్ మెన్, ఫిటర్ జోనల్ పరిధిలోకి వచ్చాయి.
ఉద్యోగులకు శుభవార్త..
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కొత్త జోనల్ వ్యవస్థతో వందలాది మంది ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. గతంలో పెద్ద జోన్లు ఉండడంతో ప్రమోషన్లలో పోటీ ఎక్కువగా ఉండేది. కొత్త జోన్ల ఏర్పాటుతో ఇప్పుడు పోటీ తగ్గుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది.
-ఎస్కే అమీరుద్దీన్, ఉపాధ్యాయుడు, టేకులపల్లి
ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగులకు అండగా ఉంటుంది. ఇటీవల పీఆర్సీ ప్రకటించి తిరిగి అందరికీ ఆమోదయోగ్యంగా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం హర్షణీయం. ఎంతో మంది నిరుద్యోగులకు కొత్త జోనల్ వ్యవస్థ వరంలా మారనుంది. జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు స్థానికులకే దక్కే అవకాశం ఏర్పడింది. మరోవైపు ఉద్యోగులకు ప్రమోషన్లు తొందరగా వస్తాయి.
ప్రమోషన్లు సులభం..
జిల్లా క్యాడర్ పోస్టుల్లో ఉద్యోగోన్నతులకు గతంలో పెద్ద జోన్ ఉండేది. దీంతో ప్రమోషన్లు రావడం ఆలస్యమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జోన్ పరిధి తగ్గింది. కేవలం రెండు ఉమ్మడి జిల్లాలు మాత్రమే జోన్లో ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ రావడం సులువు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. మల్టీ జోన్ ఉపయోగకరం. సరైన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.