
విక్టిమ్ కాంపెన్సేషన్ సీంపై అవగాహన కల్పించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో జస్టిస్ ఉజ్జల్ భుయాన్
మామిళ్లగూడెం, నవంబర్ 6: సీఆర్పీసీ అండర్ సెక్షన్ 357 -A ప్రకారం యాసిడ్ దాడులు, లైంగిక నేరాల బాధితులకు పరిహారాన్ని అందించేందుకు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్ సీమ్‌పై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చైర్మన్ మాట్లాడారు. పరిహార పథకాన్ని క్షేత్రస్థాయిలో బాధితులు సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని సూచించారు. బాధిత మహిళలకు అందించే పరిహారంపై క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష జరిపారు. అదే విధంగా ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉందన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యం పెంపొందించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, డీసీపీ ఎల్సీ నాయక్, ఏడీసీపీలు సుభాశ్ చంద్రబోస్, కే.ప్రసాద్, సీఐలు తదితరులు పాల్గొన్నారు.