
పెనుబల్లి, నవంబర్ 6: రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి ఇంటా పెద్దన్నగా ఉన్న ఆయన.. ఆడ పిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు మాత్రమే ఇంతటి గొప్ప పథకాలను అమలు చేస్తోందని వివరించారు. రూ.35,04,060 విలువ గల 35 కల్యాణలక్ష్మి చెక్కులను మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. లింగగూడెంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కాగా, కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు చీరె, సారె కలిపి లబ్ధిదారులకు అందించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తహసీల్దార్ ఎం.రమాదేవి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఎంపీవో వాల్మీకి కిశోర్, జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సీడీసీ చైర్మన్ ముక్కర భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కనగాల వెంకటరావు, భూక్యా ప్రసాద్, మందడపు అశోక్‌కుమార్, కనగాల సురేశ్‌బాబు, రామారావు, నీలాద్రిబాబు, తాళ్లూరి శేఖర్‌రావు, వంగా దామోదర్, గువ్వల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.