
అన్నదాతల సంఘటితం కోసమే రైతువేదికల ఏర్పాటు: మంత్రి అజయ్‌కుమార్
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 5: ఎర్రుపాలెం మండలానికి సీతారామ ప్రాజెక్టు జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి పథకాలను సోమవారం ఆయన ప్రారంభించారు. మండలంలోని ఎర్రుపాలెం, జమలాపురం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపడు, మీనవోలు, రామన్నపాలెం క్లస్టర్లలో నూతనంగా నిర్మించిన రైతువేదికలను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.16 లక్షలతో శఖునవీడు గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతల సంఘటితం కోసమే రైతు వేదికలను నిర్మించినట్లు వివరించారు. గతంలో ఎర్రుపాలెం పర్యటనకు వచ్చిన సందర్భంలో జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సరైన రోడ్డు సౌకర్యం లేదంటూ ఇక్కడి ప్రజలు విన్నవించారని, దీంతో రూ.3.5 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ గౌతమ్, మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ శిరీష, జడ్పీటీసీ కవిత, డీఏవో విజయనిర్మల, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, చావా రామకృష్ణ, వెంకట్రామిరెడ్డి, త్రివేణి, అప్పారావు, ఉమామహేశ్వరి, రామకోటయ్య, నారాయణ, కొండేపాటి సాంబశివరావు పాల్గొన్నారు.