
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 11 ఆఫీసులు
మంత్రి పువ్వాడ చొరవతో రఘునాథపాలెంలో కార్యాలయం
కల్లూరు, బూర్గంపహాడ్‌లో ఎత్తివేసే అవకాశం
యథావిధిగా కొనసాగనున్న ఇల్లెందు ఆఫీస్
ఖమ్మం, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్ వ్యవస్థీకరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మం, కూసుమంచి, ఖమ్మం రూరల్, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపహాడ్, భద్రాచలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భారీ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతుండగా.. మరికొన్నిచోట్ల కనీస సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎత్తివేసి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఖమ్మం నగరం, సమీప ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం.. అందుకు తగినట్లుగా కార్యాలయాలు లేకపోవడంతో ప్రజల డిమాండ్ మేరకు రఘునాథపాలెంలో కొత్త రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రఘునాథపాలెంలో ఒకటి..?
ఖమ్మం, కూసుమంచి, ఖమ్మం రూరల్, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపహాడ్, భద్రాచలం ప్రాంతాల్లో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మమ నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరానికి సమీపంలో ఒక కార్యాలయం ఉంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. ఈ మేరకు రఘునాథపాలెంలో కొత్త రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రఘునాథపాలెం, కారేపల్లి, కామేపల్లి మండలాల రిజిస్ట్రేషన్లు ఖమ్మం రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో జరుగుతుండడం, ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో రిజిస్ట్రేషన్లు ఇబ్బడిముబ్బడిగా జరుగుతుండటంతో ఆ కార్యాలయంపై పని ఒత్తిడి తగ్గించడానికి కారేపల్లి, కామేపల్లి మండలాలను కలిపి రఘునాథపాలెం కేంద్రంగా ఒక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
సవరించిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజుల అనంతరం ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినప్పటికీ ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కనీస సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని కార్యాలయాలను మరోచోటికి మార్చాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20కు పైగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఈ తరహాలో మార్చాలని యోచిస్తున్న ప్రభుత్వం కల్లూరు, బూర్గంపహాడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో ఆ కార్యాలయాల పరిధిలోని మండలాలను సమీప సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు బదలాయించాలని యోచిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే అధికారులు, సిబ్బందిని ఖాళీగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్దుబాటు చేయాలని రిజిస్ట్రేషన్‌శాఖ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తగ్గే అవకాశం ఉండగా కొత్తగా రఘునాథపాలెంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం కనిపస్తున్నది.
ఇల్లెందు కార్యాలయం కొనసాగే అవకాశం..
సత్తుపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కల్లూరులో తక్కువ రిజిస్ట్రేషన్స్ జరుగుతుండడంతో ఇక్కడి కార్యాలయాన్ని ఎత్తివేసి కల్లూరు మండలాన్ని సత్తుపల్లిలో, తల్లాడ మండలాన్ని వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భద్రాచలం, బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సమీప ప్రాంతాల్లో ఉండడం, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉండడంతో బూర్గంపహాడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు సమీప ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేకపోవడంతో ఇల్లెందును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.