
కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, ఆగస్టు 6: కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజ్ఞా మందిరంలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా, పెనుబల్లి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించేలా మండల స్థాయి టాస్క్ ఫోర్సు బృందం నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మాస్క్‌లు ధరించని వారిపై జరిమానా విధించాలన్నారు. వారంలో రెండు రోజులు తప్పని సరిగా మండల స్థాయి టాస్క్ఫోర్సు అధికారుల సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించుకోవాలని చెప్పారు. పాజిటీవ్ రోగులను తప్పని సరిగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని అన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మండల స్థాయి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కరోనా ప్రబలుతున్న మండలాల్లో కారణాలను గుర్తించి కట్టడి చేయాలని ఆదేశించారు. లక్షణాలు కలిగిన వారందరికీ పరీక్షలు చేయాలని హై రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఐసోలేషన్ కేంద్రాల వద్ద వీఆర్వో, వీఆర్ఏ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్ మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాహుల్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, డీపీవో ప్రభాకర్‌రావు, ఇన్చార్జి జడ్పీ సీఈవో కొండల్లి శ్రీరాం, ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాజేశ్, తదతరులు పాల్గొన్నారు.