
కలెక్టర్ అనుదీప్
పాల్వంచ రూరల్, ఆగస్టు 6: గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మండలంలోని ఉల్వనూరులో శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వైద్యసేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాన్ని కాలినడకన సందర్శించారు. రోడ్ల వెంబడి ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని, పూడ్చడానికి అవకాశం లేని ప్రాంతాల్లో ఆయిల్బాల్స్ను వేయాలన్నారు. మలేరియా, డెంగీ వ్యాధులున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని డాక్టర్ సుధీర్, ఎంపీవో రామకృష్ణను ఆదేశించారు. అంటువ్యాధులు ఏవిధంగా ప్రబలుతాయో గ్రామస్తులకు విరించారు. మందెరికలపాడు, ఉల్వనూరులోని పల్లెప్రకృతి వనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సింహసాగర్లోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి అంగన్వాడీ టీచర్ చంద్రకళ నియామకం పై ఏర్పడిన సమస్యపై సమగ్ర విచారణ జరపాలని తహసీల్దార్ స్వామిని ఆదేశించారు. రహదారి నిర్మాణాలపై అధికారులతో ప్రతిపాదనలు చేయించి నిర్మించే విధంగాతగిన చర్యలు తీసుకంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రప్రసాద్, ఎంపీవో రామకృష్ణ, మలేరియా అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుధీర్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సర్పంచలు రమేశ్, రుద్ర, కార్యదర్వులు సురేశ్, నరేశ్, గిర్దావర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.