
అడవి సంరక్షణతోపాటు హక్కు పత్రాల అందజేత
8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
243 గ్రామపంచాయతీల్లో 500 బృందాల పరిశీలన
జిల్లాలో 2,29,229 ఎకరాల్లో పోడు భూమి
సాగులో 53,058 మంది రైతులు
కొత్తగూడెం, నవంబర్ 5 :అంతరించి పోతున్న అడవులకు రక్షణ కల్పించాలి. అదే క్రమంలో ఏళ్లుగా పోడు చేస్తున్న గిరిజన రైతులకు అండగా నిలవాలి. ఒకేసారి రెండు సమస్యలు పరిష్కారం కావాలి. అయితే, ఈ జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అటవీహక్కు చట్టాన్ని తీసుకొచ్చినా.. హక్కు పత్రాలు ఇవ్వడంలో విఫలమైంది. కొంత మందికి మాత్రమే పట్టాలు అందడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పోడు సమస్యల జోలికి వెళ్లలేదు. దీంతో గిరిజనులు, అధికారుల మధ్య పోడు సమస్య రగులుతూనే ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోడు సమస్యకు చెక్‌పెట్టి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు సబ్ కమిటీ వేసి పోడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నది. అన్నిపార్టీల నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. అంతేకాదు, ఈ నెల 8వ తేదీ నుంచి గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నది. ఐటీడీఏ, అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. గిరిజన ప్రాంత సమస్య కాబట్టి ఐటీడీఏ పీవో పొట్రు గౌతమ్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు.
పోడు సమస్యకు చెక్ పెట్టడంతోపాటు అడవిని సంరక్షించాలన్న సర్కారు సంకల్పానికి అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో త్వరలో పోడు సమస్యలు కొలిక్కి రానున్నాయి. గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యటించి సాగు రైతుల వివరాలు సేకరించి వారికి వీలైనంత త్వరలో హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి గిరిజనులు, గిరిజనేతరుల వద్ద దరఖాస్తులు తీసుకోనున్నారు. ఐటీడీఏ, అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. గిరిజన ప్రాంత సమస్య కాబట్టి నోడల్ అధికారిగా ఐటీడీఏ పీవో గౌతమ్ వ్యవహరించనున్నారు. అటవీ హద్దులు నిర్దేశించి సాగులో ఉన్నవారిని గుర్తించనున్నారు. పాత రికార్డులను సైతం పరిగణలోకి తీసుకొని భూములపై ఉన్న హక్కులను నిర్ణయిస్తారు. అటవీహక్కు చట్టంలోని నిబంధనలు అమలు చేస్తూ సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. గతంలో కొందరు అటవీహక్కుల సాకుతో వేలాది ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. అయితే, ఇది కొంత మంది ఆధీనంలోనే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తేల్చారు.
జిల్లాలో 2,29,229 ఎకరాల్లో పోడు భూమి
అటవీశాఖ అధికారుల అంచనా ప్రకారం.. భద్రాద్రి జిల్లాలో 2,29,229 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయి. 53,058 మంది రైతులు సాగు చేస్తున్నారు. 53 వేల మందికిపైగా రైతుబంధు అందుతున్నది. మరికొంత మంది చేతుల్లో పట్టాలున్నా వారికి సాయం అందడం లేదు. వీరంతా అటవీభూముల్లో సాగు చేస్తున్నట్లు ఫారెస్టు రికార్డులో ఉండడంతో వారికి సాయం అందడం లేదు. అంతేకాకుండా, రెవెన్యూ అధికారులు అప్పట్లో అటవీ భూములని చూడకుండా పట్టాలు ఇచ్చారు. కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు ఏరియాల్లో సమస్య తీవ్రంగా ఉన్నది.
పోడు సమస్యకు పరిష్కారం
పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. చాలాసార్లు అటవీ భూముల సమస్యలపై అధికారులకు విన్నవించడం జరిగింది. జడ్పీ సమావేశాల్లోనూ ప్రస్తావించాం. ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లాం. ఎట్టకేలకు తెలంగాణ సర్కారు పోడు సమస్య పరిష్కారానికి ముందుకు రావడం సంతోషంగా ఉంది.
జిల్లాలో భూముల వివరాలు
జిల్లాలో భూమి పరిధి : 17,47,971 ఎకరాలు.
అటవీశాఖ పరిధి : 10,13,698 ఎకరాలు. (57.97 శాతం)
ఆక్రమణలో ఉన్న భూమి : 2,29,229 ఎకరాలు. (22.61 శాతం).
2005కు ముందు 6,290 మంది గిరిజన రైతుల ఆధీనంలో 26,794 ఎకరాలు ఉంది.
2005 తర్వాత 39,922 మంది గిరిజన రైతుల ఆధీనంలో 1,72,679 ఎకరాలు ఉంది.
2005కు ముందు 208 మంది ఎస్సీ రైతుల ఆధీనంలో 621 ఎకరాలు ఉంది.
2005 తర్వాత 851 మంది ఎస్సీ రైతుల ఆధీనంలో 3,803 ఎకరాలు ఉంది.
2005కు ముందు 8 మంది గొత్తి కోయ రైతుల ఆధీనంలో 16ఎకరాలు ఉంది.
2005 తర్వాత 2,810 మంది గొత్తికోయల ఆధీనంలో 13,967 ఎకరాలు ఉంది.
2005కు ముందు 353 మంది గిరిజనేతరుల ఆధీనంలో 1,006 ఎకరాలు ఉంది.
2005 తర్వాత 2,616 మంది ఆధీనంలో 10,342 ఎకరాలు ఉంది.