
నయాబజార్, బాలికల జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లు
ఖమ్మం జిల్లాకు రెండు లక్షల సమాధాన పత్రాలు
రెండు స్పెల్స్‌లో నిర్వహణ: క్యాంపు ఆఫీసర్‌గా రవిబాబు
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 5: ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షల సమాధాన పత్రాలను జంబ్లింగ్ పద్ధతిన జిల్లాలకు తరలించి మూల్యాంకన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్యాంపును ఏర్పాటు చేశారు. లాంగ్వేజెస్, సబ్జెక్టుల్లో ఖమ్మం జిల్లాకి మూల్యాంకనం పత్రాలు కేటాయించారు.
రెండు క్యాంపులు..
కొవిడ్ నిబంధనల్లో భాగంగా సమాధాన పత్రాల మూల్యాంకనం కోసం ఈ సంవత్సరం రెండు క్యాంపులను ఏర్పాటు చేశారు. నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఒకటో కేంద్రంలో సంస్కృతం, ఇంగ్లిషు, గణితం; ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని రెండో కేంద్రంలో తెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్, బోటనీ సబ్జెక్టులను మూల్యాంకనం చేయనున్నారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లకు కొందరు రిపోర్ట్ చేశారు. సమాధాన పత్రాల ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులతోపాటు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో, కేజీబీవీల్లో, ఇతర ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేసే సీనియర్ అధ్యాపకులకు నేరుగా ఇంటర్ బోర్డు నుంచే మూల్యాంకనం ఉత్తర్వులను జారీ చేశారు.
రెండు స్పెల్స్‌లో..
మూల్యాంకన ప్రక్రియను రెండు స్పెల్స్‌లో ప్రారంభిస్తున్నారు. శనివారం నుంచి సంస్కృతం, ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణితం (ఏ అండ్ బీ), పొలిటీకల్ సైన్స్, బోటనీ సబ్జెక్టులను, రెండో స్పెల్‌ను ఈ నెల 8 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, కామర్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేలా షెడ్యూల్ రూపొందించారు.
1,97,823 పత్రాలు..
ఖమ్మం క్యాంపునకు ఉన్నతాధికారులు 1,97,823 సమాధాన పత్రాలను కేటాయించారు. ఈ మూల్యాంకనం ప్రక్రియలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన అధ్యాపకులు పాల్గొంటారు. ప్రతి రోజూ క్యాంపు ఆఫీసర్‌తో బోర్డు సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితులను తెలుసుకుంటారు. క్యాంపులో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
క్యాంపు ఆఫీసర్‌గా రవిబాబు..
ప్రధానంగా క్యాంపు ఆఫీసర్‌గా జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు వ్యవహరిస్తుండగా.. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లలో జనరల్-1లో ఇద్దరు, ఏసీవో జనరల్-2 నయాబజార్‌లో ఒకరు ఉండనున్నారు. ఒక బోర్డులో ఐదుగురు ఏఈలు, ఒక సీఈ (చీఫ్ ఎగ్జామినర్), వీళ్లకి ఒక ఎస్ఈ (సబ్జెక్టు ఎక్స్పర్ట్)ను కేటాయించారు. శుక్రవారం క్యాంపు ఆఫీసర్ ఆధ్వర్యంలో నయాబజార్లోని కోడింగ్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌కి, అక్కడ నుంచి క్యాంపునకు సబ్జెక్టుల వారీగా సమాధాన పత్రాలను తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాంపు నిర్వహించనున్నారు.