
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 5: ఖమ్మం నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు 30 నిమిషాలపాటు జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణమే ఉంది. సాయంత్రం వేళ నిమిషాల వ్యవధిలోనే నగరంపై దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. కొద్దిసేపటి తరువాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సాయంత్రం వేళ కావడంతో కార్యాలయాల్లో విధులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, విద్యాసంస్థల నుంచి వెళ్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ప్రధాన వీధుల్లోకి వరద నీరు చేరింది.