
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్
జూలూరుపాడు,ఏన్కూరు మండలాల్లో రైతువేదికలు ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్యే రాములునాయక్,జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
జూలూరుపాడు, సెప్టెంబర్ 5: పంటలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ రాష్ట్రం అన్నపూర్ణగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన పడమట నర్సాపురం, తిమ్మారావుపేటలో రైతువేదికలు ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో ఉదయం విద్యుత్ సరఫరా ఉంటే సాయంత్రం ఉండేది కాదన్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నదన్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, పంటలకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ తెలంగాణ అన్నపూర్ణగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పడమట నర్సాపురంలో రైతువేదిక, పాపకొల్లులో కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ప్రారంభించి అనంతరం పాపకొల్లులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వ్యవసాయ బోర్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సబ్స్టేషన్లు నిర్మిస్తున్నదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో ఉదయం విద్యుత్ సరఫరా ఉంటే సాయంత్రం ఉండేది కాదన్నారు. కొన్నిసార్లు రాత్రిళ్లు సరఫరా చేయడంతో రైతులు విద్యుత్ కోసం కాపు కాయాల్సి వచ్చేదన్నారు. అప్పట్లో రైతులు విద్యుత్‌షాక్, పాము కాటుతో మృతిచెందారన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండేవన్నారు. స్వరాష్ట్రం వచ్చాక రైతుల కష్టాలు తీరాయన్నారు. గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించగా నాటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానన్నారు. ఇప్పుడు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది నిజమా కాదా అనేది జానారెడ్డి ఆలోచించుకోవాలన్నారు.
జూలూరుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్, సైడు డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీకి దాసోహమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిన సమయంలో విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం కుట్రపన్నుతున్నదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం పన్నాగం పన్నుతున్నదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ.. జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి మండలాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూడాలని మంత్రిని కోరారు. సమావేశంలో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ భుక్యా కళావతి, ఎంపీపీ లావుడ్యా సోని, సహకార సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకరెడ్డి, పడమట నర్సాపురం సర్పంచ్ కట్రం మోహన్‌రావు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఏన్కూరు, సెప్టెంబర్ 5: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేటలో ఆదివారం ఆయన వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి రైతువేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతువేదికలు నిర్మిస్తున్నారన్నారు. స్వరాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసి సాధించారన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను స్వరాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అందిస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసమే దళితబంధు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు వేతనాలు సకాలంలో ఇవ్వలేకపోయినా ప్రభుత్వం ఆసరా పింఛన్లు మాత్రం ఆపడం లేదన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలచిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్క్‌ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు గుత్తా వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడా ధర్మారావు, సర్పంచ్‌లు చిర్రా రుక్మిణి, ఆరెం సుహాసిని, ఎంపీపీ ఆరెం వరలక్ష్మీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోతు సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.