
సింగరేణి భాగస్వామ్యంతో సౌత్ సెంట్రల్ రైల్వే నిధులు
ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తికానున్న పనులు
బొగ్గు రవాణాకు సన్నాహాలు
లోడింగ్ కోసం నాలుగు ట్రాక్‌లు
నిర్మాణ దశలో ఆరు రైల్వేస్టేషన్లు
ఖమ్మం, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. సింగరేణి యాజమాన్యం బొగ్గు లోడింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను అధిగమించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. వచ్చే డిసెంబర్లో పనులు పూర్తి చేసి బొగ్గు రవాణా చేసేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తున్నది.. మరోవైపు సకాలంలో పనులు పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు పని చేస్తున్నారు.. నిర్మాణానికి రూ.950 కోట్లు అంచనా వేయగా సింగరేణి యాజమాన్యం రూ.618.55 కోట్లు చెల్లిస్తున్నది. ఇప్పటికే రూ.506.88 కోట్లు రైల్వేశాఖకు చెల్లించింది..
సింగరేణి నుంచి ఇతర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లక్ష్యంతో సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ తో ఒప్పందం కుదుర్చుకుని భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ నిర్మిస్తున్నది. రైల్వేలైన్‌కు నిర్మాణానికి మొత్తంగా రూ.950 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా వీటిలో సింగరేణి యాజమాన్యం రూ.618.55 కోట్లు వెచ్చించేందుకు అంగీకారం తెలిపింది. మిగతా నిధులు సౌత్ సెంట్రల్ రైల్వే వెచ్చించనున్ననది. వీటిలో సింగరేణి ఇప్పటికే రూ.506.88 కోట్లు సౌత్ సెంట్రల్ రైల్వేకు అందజేసింది. 54 కి.మీ రైల్వేలైన్ నిర్మించేందుకు రూ.950 కోట్లు ఖర్చవుతుండగా మరో 3.5 కి.మీ నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం సొంతంగా నిధులు వెచ్చిస్తున్నది. అందుకు రూ.140 కోట్లు ఖర్చు పెడుతున్నది. ఇప్పటికే పనుల్లో సింహభాగం పూర్తయ్యాయి. ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు భారీ వర్షాలు లేకుంటే ఈ పాటికే పనులు పూర్తయి బొగ్గు రవాణా జరిగేది. పనుల్లో ఇక జాప్యం ఉండకూడదని సింగరేణి యాజమాన్యం సౌత్ సెంట్రల్ రైల్వేపై ఒత్తిడి పెంచింది. దీంతో రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. వచ్చే డిసెంబర్‌లోగా ఈ రైలుమార్గంలో బొగ్గు రవాణా చేయవచ్చని సింగరేణి యాజమాన్యం అంచనా వేస్తున్నది.
బొగ్గు రవాణా సులభం..
రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2, కిష్టారం ఓసీల నుంచి 12 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ప్రస్తుతం రైల్వే రేకులు(54 వ్యాగన్లు) మన రాష్ట్రంతో పాటు ఇతర ఇతర రాష్ర్టాలకు లారీల ద్వారా సరఫరా అవుతున్నది. రైల్వే లైన్ పూర్తయితే రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా కానున్నది. బొగ్గు లోడింగ్ కోసం సత్తుపల్లిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ) పనులు కొనసాగుతున్నాయి. అందుకు సింగరేణి రూ.400 కోట్లు నిధులు కేటాయించింది. ఇక్కడ 1000 టన్నుల బొగ్గు కెపాసిటీ కలిగిన రెండు సైలో లోడింగ్ పాయింట్లు ఏర్పాటవుతున్నాయి. ఈ లోడింగ్ పాయింట్ల కోసం నాలుగు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటవుతున్నాయి. రెండు రైల్వే లైన్ల ద్వారా బొగ్గు లోడింగ్, మరో రెండు లైన్లలో వ్యాగన్లు లోడింగ్‌కు వేచి ఉండే విధంగా ఉండబోతున్నాయి. మొత్తంగా రైల్వేలైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో రైలు మార్గాన బొగ్గు రవాణా చేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణి యాజమాన్యం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో రైల్వేలైన్‌లో ట్రయల్న్ కూడా పూర్తయింది. ఈ నెల 10న సత్తుపల్లి రైల్వేమార్గంలో చండ్రుగొండ వరకు మరో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
రోజుకు 10 రేకులకు పైనే బొగ్గు రవాణా
రైల్వేస్టేషన్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రైల్వేట్రాక్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రవాణాకు మార్గాలు సుగమం అవుతున్నాయి. పనులన్నీ పూర్తయతే ప్రతి రెండు గంటలకు ఒక రేకు (54 వ్యాగన్లు) బొగ్గు లోడింగ్ అయి రవాణా జరుగుతుంది. నిర్దేశిత ప్రాంతాలకు రోజుకు 10 రేకులకు పైనే బొగ్గు రవాణా అవుతుంది.
కాలుష్యానికి చెక్
సాధారణంగా సత్తుపల్లి నుంచి కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీకి లారీల ద్వారా బొగ్గు రవాణా చేయడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది. నిత్యం లారీలు తిరుగుతుండడంతో రహదారులపై గుంతలు ఏర్పడుతున్నాయి. ఆ గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహన రద్దీ ఏర్పడడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికే రైల్వేలైన్ రూపుదిద్దుకుంటున్నది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యమూ ఏర్పడనున్నది.
నిర్మాణ దశలో రైల్వే సేషన్లు
రైల్వే లైన్లో ఆరు స్టేషన్లలో పరిధిలో ప్యాసింజర్ రైలు ఆగాల్సి ఉన్నది. ప్రయాణికులకు రవాణాసేవలు అందించాల్సి ఉన్నది. రైల్వే స్టేషన్ల నిర్మాణం మరింత ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సమీప కాలంలో సేవలు అందేలా లేవు. మున్ముందు నిర్మాణాలు పూర్తయితే ప్రయాణికులకు సేవలు అందనున్నాయి.