
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా
చింత లేకుండా పంటల సాగు
వాణిజ్య పంటల వైపు.. కర్షకుల చూపు
ఖమ్మం జిల్లాలో పెరిగిన మిర్చి తోటల పెంపకం
కూసుమంచి, సెప్టెంబర్ 5 : గత ప్రభుత్వాల హయాంలో పంటలకు ఏకధాటిగా మూడు గంటల కరెంట్ ఉంటే గొప్ప.. ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో తెలియదు.. దీంతో రైతులు వాణిజ్య పంటలు సాగు చేయడానికి ముందుకు వచ్చేవారు కారు.. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తుండడంతో రైతులు వాణిజ్య పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సాగవుతున్న పంటలపై ప్రత్యేక కథనం.
మిర్చి పండించే జిల్లాల్లో ఖమ్మం ప్రధానమైనది. 21 మండలాల్లో 36,222 మంది రైతులు 59,990 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా.. 1,39,976 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈసారి 80 వేల ఎకరాల్లో మిర్చి తోటలు వేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా రఘునాథపాలెం మండలంలో 7,567 ఎకరాల్లో 5,167 మంది రైతులు మిర్చి వేశారు. తరువాత కామేపల్లి మండలంలో 6,838 ఎకరాల్లో 4,441 మంది రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. దీంతో మిర్చి నారుకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. బీటీ విత్తనాలను నర్సరీల్లో మొక్కలుగా పెంచుతున్నారు. కొందరు రైతులు స్వయంగానే నారు పోసుకున్నారు.
అన్ని సౌకర్యాలూ ఉంటే అన్నదాతలు కూడా తమ ఆలోచనను మార్చుకుంటారు. సౌకర్యాలు లేని చోట ఉన్న వాటితోనే సర్దుకుపోతారు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటారు. రాళ్లల్లోనూ రత్నాలు పండిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నీటి వనరులు, విద్యుత్ సదుపాయాలు లేని రోజుల్లో మూస ధోరణిలో అందుకు తగిన పంటలే సాగు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అన్నదాతల అవసరాలను గుర్తించింది. అందుకు తగ్గట్టుగా వారికి సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. వ్యవసాయానికి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది. దీంతో హలధారులు ఆలోచనను మార్చుకున్నారు. వాణిజ్య పంటలవైపు ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో రైతులు వాణిజ్య పంటలు, కూరగాయల, పండ్ల తోటల వైపునకు మొగ్గు చూపుతున్నారు. మూడేళ్లుగా వరి వేసిన రైతులు క్రమంగా పంటల సాగు విధానంలో మార్పులు చేస్తున్నారు. కూరగాయలు, మిర్చి, బొప్పాయి, పత్తి వంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సరం మిర్చికి ఎక్కువగా ధర ఉండడం, ధాన్యంతో రైతులకు కొంత ఇబ్బందులు కలగడంతో ఎక్కువగా మిర్చి తోటల వైపు ఆలోచిస్తున్నారు. కష్టపడి పెట్టుబడి పెడితే తోటల కంటే మంచి లాభాలు ఏ పంటలోనూ రావని రైతులు అంటున్నారు. పెరిగిన భూగర్భ జలాలు, కోతల్లేని విద్యుత్ వంటి సౌకర్యాలు రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడానికి దోహదమవుతున్నాయి.
మూడెకరాల తోటలో నాన్నకు తోడుగా..
నేను డిగ్రీ చదువుతున్నా. మాకున్న మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాం. నాన్న ఒక్కడే పని చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతోంది. దీంతో నేను కూడా నాన్నకు తోడుగా మిర్చి తోటలో పని చేస్తున్నా. నిరుడు కూడా మంచి దిగుబడి వచ్చింది. దీంతో ఈ సంవత్సరం మళ్లీ మిర్చి పంట వేస్తున్నాం. నా చిన్నప్పుడు మా నాన్న రాత్రి సమయంలో పొలానికి వెళ్లి కరెంటు వచ్చినప్పుడు మోటారు వేసి నీళ్లు పట్టేవాడు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. 24 గంటలూ కరెంటు వస్తోంది.
-వడ్తియా నాగమణి, డిగ్రీ విద్యార్థిని, గంగంబండతండా
కరెంటు సమస్య లేదు..
నిరుడు నేను 2 ఎకరాల్లో మిర్చి పంట వేశా. ఈసారి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నా. గతంలో కరెంట్ సమస్య, నీటి సమస్య ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు సమస్యలూ లేవు. మిర్చికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతోతోపాటు అన్ని సౌకర్యాలూ ఉండడంతో ఆ పంటను సాగు చేస్తున్నాం. నర్సరీ నుంచి నారు తెచ్చుకున్నాం.
-బారి వెంకటమ్మ, మహిళా రైతు, కూసుమంచి