మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నేలకొండపల్లి, సెప్టెంబర్ 5: జీవితకాలం తాను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ప్రయాణిస్తానని, తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని చెన్నారం, సుర్థేపల్లి గ్రామాల్లో పర్యటించి చెన్నారంలోని సర్పంచ్ మస్తాన్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారాయన్నారు. ప్రభుత్వం సుమారు రూ.44 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. పాలేరు పాతకాలువ, భక్త రామదాసు ప్రాజెక్ట్, ఆకేరు, మున్నేరుపై చెక్‌డ్యాంలు నిర్మించిందన్నారు. గోదావరి జలాలను పాలేరు వరకు తీసుకొచ్చేందుకు సీతారామ పాజెక్ట్ నిర్మిస్తుందన్నారు. అనంతరం సుర్థేపల్లి వద్ద నిర్మించిన చెక్‌డ్యాంను పరిశీలించారు. సమావేశంలో నాయకులు తమ్మినేని కృష్ణయ్య, రవి, సాధు రమేశ్‌రెడ్డి, వెన్నపూసల సీతారాములు, శాకమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, కడియాల శ్రీనివాసరావు, యడవల్లి సైదులు పాల్గొన్నారు.