
కాంతులీనుతున్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి కోవెల
రేపట్నుంచి రోజుకో అలంకారంలో అమ్మవారి దర్శనం
15న శమీ, ఆయుధ పూజలు, రామయ్యకు పట్టాభిషేకం
భద్రాచలం, అక్టోబర్ 4: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ ప్లవనామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య ఈ నెల 6 నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి 15 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శివాజీ సోమవారం తెలిపారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల కోసం శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి కోవెలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. 6న ఆదిలక్ష్మి, 7న సంతానలక్ష్మి, 8న గజలక్ష్మి, 9న ధనలక్ష్మి, 10న ధాన్యలక్ష్మి, 11న విజయలక్ష్మి, 12న ఐశ్వర్యలక్ష్మి, 13న వీరలక్ష్మి, 14న మహాలక్ష్మి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజూ లక్ష్మీతాయారు అమ్మ వారి సన్నిధిలో ఉదయం అభిషేకం, సామూహిక కుంకుమార్చన, విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్ర పుష్పం, ప్రసాద గోష్టి జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలను చిత్రకూట మండపంలో నిర్వహించనున్నారు. 15న సాయంత్రం 4 గంటలకు దసరా మండపంలో ‘శమీ పూజ’ను శ్రీరామ లీలా మహోత్సవంగా జరుపుతారు. అదేరోజు ఉదయం 11:30 గంటలకు శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా “శ్రీరామ పట్టాభిషేకం’ నిర్వహిస్తారు. 1974లో ప్రారంభమైన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి వరకు నిర్విఘ్నంగా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.