
విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులకు తప్పనిసరి పరిష్కారం
10 జిల్లాల్లో 212 కేసుల్లో రూ.2.40 లక్షల పరిహారం
వాట్సప్, ఫోన్ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటాం
ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్-1 చైర్మన్ సత్యనారాయణ
కూసుమంచి, అక్టోబర్ 4: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు సేవలు అందించడం కోసమే ఫోరం పనిచేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ (వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక)-1 చైర్మన్ పీ.సత్యనారాయణ పేర్కొన్నారు. మెరుగుపడిన విద్యుత్ సేవలు మరింతగా మంచిగా ప్రజలకు అందాలనే లక్ష్యంతోనే ఈ వేదికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కూసుమంచిలోని 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో (కొత్త జిల్లాలు పది) 230 కేసులు ఫోరం వేదికకు వచ్చాయని, వాటిల్లో 212 కేసులు పరిష్కారమయ్యాయని, 18 కేసుల పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఇందులో సుమారు 200 వరకు కేసుల తీర్పులు వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఫోరం ద్వారా రూ.2.44 లక్షల పరిహారాన్ని వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. తల్లాడలో ఒక ఉద్యోగి ద్వారా రూ.32 వేల జరిమానాను వినియోగదారుడికి చెల్లించినట్లు చెప్పారు.
వాట్సప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ..
వినియోగదారులకు ఏవైనా సమస్యలుంటే ఫోన్ ద్వారా గానీ, వాట్సప్ ద్వారా గానీ ఫోరానికి ఫిర్యాదు చేయవచ్చునని చైర్మన్ తెలిపారు. 9440811299, 9491307004, 8333923840, 9492475745 నెంబర్లను సంప్రదించవచ్చునని అన్నారు. డీఈ కృష్ణ, ఏడీఈ కోటేశ్వరరావు, ఎస్ఏవో మురళి, ఏఏఈలు వెంకన్న, శంకర్, బాలాజీ, కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్రావు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
తక్షణం మీటరు ఏర్పాటు
మండలంలోని నర్సింహులగూడేనికి చెందిన జూలూరి వెంకన్న అనే రైతు తన ఇంటికి కొత్త మీటరు కావాలని వేదికలో కోరడంతో చైర్మన్ సత్యనారాయణ, సభ్యుడు తిరుమలరావు వెంటనే స్పందించారు. అతడి నుంచి వివరాలు తీసుకొని తక్షణమే మీటరు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.