
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రైతు బంధు సంబురాలు
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం
రైతు బంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జై రైతుబంధు, కేసీఆర్ అంటూ మిర్చితో అక్షరమాల
ఖమ్మం, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతుబంధు సంబురాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో మిర్చితో రైతులు రైతుబంధు పథకం పేరును వినూత్నరీతిలో అక్షరమాలను రూపొందించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్లలో మహిళలు ముగ్గులు వేశారు. సత్తుపల్లి మండలం గంగారం, వేంసూరు మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు.
వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 3నుంచి 10వ తేదీ వరకు పార్టీ శ్రేణులు, రైతుల సంబురాలు అంబరాన్నంటాయి. పలుచోట్ల రైతులు వినూత్నరీతిలో హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో మిర్చి రైతులు మిరపకాయలతో ‘రైతుబంధు’ పేరును అక్షరమాలగా రూపొందించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్లలో మహిళలు ‘తెలంగాణ రైతుబంధు’ ముగ్గు వేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం గంగారం, వేంసూరు మండల కేంద్రంలో సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రైతు బాంధవుడు, రైతులకు ఎప్పుడు ఏమికావాలో తెలుసుకుని మరీ సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో రైతుబంధు పథకం చర్చనీయాంశంగా మారిందని, అనేక రాష్ర్టాలు కేసీఆర్ పథకాలపై దృష్టి సారించాయని పేర్కొన్నారు. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు.
అప్పుల ఊబి నుంచి రైతులను గట్టెక్కించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రఘునాథపాలెం మండలంలోని వివిధ ప్రాంతాల్లో రైతు సంబురాలు చేయడంపై మంత్రి పువ్వాడ పార్టీ శ్రేణులు, రైతులను అభినందించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌కు రైతాంగం పూర్తి కృతజ్ఞతతో ఉందన్నారు. పినపాక నియోజకవర్గంలోని పినపాక, మణుగూరు, బూర్గంపహాడ్ మండలాల్లో రైతువేదికల్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాల్లో రైతులు, అధికారులు పాల్గొన్నారు. దుమ్ముగూడెం మండలంలో సమావేశం, చింతకాని మండలంలో రైతువేదికలో సదస్సు నిర్వహించారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు, టేకులపల్లి మండలంలో రైతుబంధు ఉత్సవాలకు రైతువేదికలను ముస్తాబు చేస్తున్నారు. రైతుబంధు ఉత్సవాల నిర్వహణపై మండలస్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించారు. వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ రైతుబంధు పథకం దేశంలోనే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం చారిత్రాత్మకమని అన్నారు. చండ్రుగొండ మండలంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడారు. దమ్మపేటలో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నేలకొండపల్లిలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయచంద్ర పాల్గొన్నారు. మధిరలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు క్షీరాభిషేకం చేశారు.
రూ.2,661 కోట్ల రైతుబంధు సాయం
ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్ వరకు రైతుల ఖాతాల్లో రూ.2.661 కోట్లు జమయ్యాయి. ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 2,60,797 మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో రూ.200.17 కోట్ల సొమ్ము జమ అయ్యింది. ఈ నెల 10వ తేదీలోపు మిగిలిన రైతులకు రైతుబంధు జమకానుంది.
రైతుబంధుతో భరోసా : మంత్రి పువ్వాడ
కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రైతుల్లో భరోసా కలిగిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో పంజాబ్‌ను మించిపోవడం అసాధారణ విజయమన్నారు. 8వ విడుతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శ పథకం రైతుబంధు : లింగాల
రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శనీయమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధిరలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు, రైతు సంఘాల నాయకులు సంబురాలు చేసుకున్నారు. జై కేసీఆర్… రైతుబంధు వర్ధిల్లాలి.. 50వేల కోట్లు అన్న పదాలను వరి ధాన్యంతో పేర్చి ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి రైతుబంధు విడుదల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ ఏరోజూ కూడా రైతుల గురించి ఆలోచించని బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 24గంటలపాటు ఉచిత విద్యుత్‌ను రైతులకు అందించిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో 50వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పికొట్టే విధంగా రైతులు, కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, ఎంపీపీ మెండెం లలిత, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, పల్లపోతు ప్రసాద్, కౌన్సిలర్లు సయ్యద్ ఇక్బాల్, యర్రగుంట లక్ష్మి, మేడికొండ కళ్యాణి, తొంగరు ఓంకార్, గద్దల నాని, గుగులోతు కృష్ణానాయక్, ముత్తవరపు ప్యారీ, నియోజకవర్గ యువజన నాయకులు కోన నరేందర్‌రెడ్డి, జే.వీ.రెడ్డి, ములకలపల్లి వినయ్‌కుమార్, రామకృష్ణ, పిడికిడి సాంబశివరావు, ఆళ్ల నాగబాబు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, శివరాంప్రసాద్ పాల్గొన్నారు.
ఏటా గేదెను కొనుక్కుంటున్నా..
రైతుబంధు పథకంతో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కలుగుతున్నది. ప్రభుత్వ పెట్టుబడి సాయంతో అప్పులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. ప్రతి సీజన్లో ఠంచన్‌గా రైతు బంధు సాయం అందుతున్నది. వానకాలం వచ్చిందంటే చేతిలో డబ్బులు ఉండేవికావు. అప్పులు చేసి వ్యవసాయం చేసేది వచ్చిన పంట డబ్బులు అప్పులకు సరిపోయేవి. సీఎం కేసీఆర్ దయతో అప్పుల బాధలు తప్పాయి. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ప్రతి ఏడాది రెండు పంటలకు రూ.25 వేలు సాయం అందుతున్నది. సీజన్ సమయానికి డబ్బులొస్తున్నాయి. ఈ యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందింది. పంట లాభంతో ప్రతి ఏటా గేదెను కొనుక్కుంటున్నాను. ఏడాదికి ఒకటి చొప్పున ఇప్పటికి 3 గేదెలను కొన్నాను. రోజుకు 5 లీటర్లు పాలు అమ్ముకుంటున్నాను. నెలకు రూ.9 వేలు ఆదాయం వస్తున్నది. సీఎం కేసీఆర్ సార్ చల్లగుండాలి.-ఆర్ శ్రీను, రైతు, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి