
‘ఇంటింటికీ కేసీఆర్- గ్రామగ్రామానికి టీఆర్ఎస్’ లక్ష్యం ఇదే..
అశ్వాపురం పర్యటనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కుటుంబాలకు ఆర్థిక సాయం..
మణుగూరు రూరల్, జనవరి 4: ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే ‘ఇంటింటికీ కేసీఆర్ – గ్రామగ్రామానికీ టీఆర్ఎస్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అశ్వాపురం మండలంలోని ఎలకలగూడెం, కొత్తూరు, గొందిగూడెం గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎలకలగూడెం గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎలకలగూడెం కరకతోగు చెరువును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి మరమ్మతులకు నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. కొత్తూరు, గొందిగూడెం గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి బాట పట్టాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తాగునీరు, రోడ్లు, పింఛన్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికక్కడే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు అమరేందర్, పొడియం ముత్యాలమ్మ, నాయకులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, ఇన్చార్జి ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్ సురేశ్, ఆర్అండ్బీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
పలు కుటుంబాలకు ఆర్థిక సాయం..
ఎలకలగూడెం గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు పక్షవాతంతో బాధపడుతుండగా.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయనను పరామర్శించారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా అశ్వాపురం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన అభిరామ్ గుండె వ్యాధితో బాధపడుతుండగా రూ.10 వేలు, అదే గ్రామానికి చెందిన సోలం చంద్రయ్య కరెంట్ షాక్కు గురై గాయాలపాలవ్వగా రూ.10 వేలు, అదే గ్రామానికి చెందిన తాటి పులమ్మ గుండె వ్యాధితో బాధపడుతుండగా రూ.10 వేలు, తుమ్మలచెరువు గ్రామానికి చెందినగడకరి రామకృష్ణ తండ్రి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో రూ.10 వేలు, సోడే నారాయణ అగ్ని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడగా.. ఆయన కుటుంబానికి రూ.10 వేలను రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేశారు. అందరికీ అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.