
చూసి తరించిన భక్తజనం
భద్రాద్రిలో కొనసాగుతున్న ఏకాదశి ఉత్సవాలు
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 4: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వై భవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామ య్య స్వామి మంగళవారం కూర్మావతారంలో భక్తులను అ నుగ్రహించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆల య తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం తదితర కార్యక్రమాలు జరిపారు. అనంత రం బేడా మండపంలో ఉత్సవ పెరుమాళ్లను, కణ్ణన్, ఆండాళ్ తల్లిని ఉంచి తిరుప్పావై పఠించారు. అమ్మవారికి 30 పాశురాలు విన్నవించారు. అనంతరం బేడా మండపంలో నిత్యకల్యాణమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, పన్నిద్ధరాళ్వార్లకు పరివట్టం కట్టి ఆల య మర్యాదలు చేశారు. ఆ తర్వాత ఆస్థాన స్థానాచార్యులకు పరివట్టం కట్టి శఠారితో పంచముద్రలు సమర్పించారు. అనంతరం నాళాయిర దివ్య ప్రబం ధం, 200పాశురాలను 12 మంది అధ్యాపకులు పఠించారు. వేదా పారాయణం చేశారు. బేడా మండపంలోనే స్వామివారిని సాయంత్రం వరకు ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం ప్రజలను గుంపులుగుంపులుగా ఉండకూడదని ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోనే జరిపారు. పర్ణశాలలోనూ స్వామివారు కూర్మావతారంలో దర్శనమిచ్చారు.
నేడు వరాహాతారం..
‘ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ని సంహరించి భూమిని రక్షించాడు.’ అనేది పురాణోక్తి. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు.