
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 4: ఢిల్లీలో ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర దిన వేడుకల్లో నృత్య ప్రదర్శన చేయడానికి భద్రాద్రి జిల్లా విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని కలెక్టర్ అనుదీప్ అభినందించారు. రాజ్‌పథ్‌లో అతిరథ మహారధుల సమక్షంలో కనుల పండువగా జరిగే వేడుకల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేయనుండడం గొప్ప విషయమని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరుడు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించిన వేడుకల్లో శ్రీదుర్గాసాయి నృత్య నికేతన్ గురువు డాక్టర్ సీతాప్రసాద్ శిష్యబృందంలోని 10 మంది విద్యార్థినులు మన సంస్కృతీ సంప్రదాయాలపై ప్రదర్శన చేసి ఎంపికైనట్లు చెప్పారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు బెంగళూరులో జోనల్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లోనూ గెలుపొందారన్నారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించారన్నారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.