
చెడుపై మంచి గెలిచిన యుద్ధానికి ప్రతీక దీపావళి
వేడుకకు సిద్ధమైన ఉమ్మడి జిల్లావాసులు
లక్ష్మీపూజ, దీపారాధనకు ఆడపడుచుల ఏర్పాట్లు
పటాకుల దుకాణాల వద్ద చిన్నారులు, యువతీ యువకుల సందడి
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, నవంబర్ 3: ‘దీపం’ లోకానికి వెలుగులు పంచుతుంది.. జీవితాల్లో కాంతిరేఖలు నింపుతుంది.. చైతన్య దీప్తిని రగిలిస్తుంది.. జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది.. కొత్త ఆశలను తీసుకువస్తూ దీపావళి వచ్చేసింది.. గురువారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా పండుగ జరుపుకోనున్నారు.. పటాకుల చప్పుళ్లు.. పిల్లాపాపల కేరింతలతో వేడుక ఆనందాలను పంచనున్నది.
‘దీపం’ చీకటి నుంచి వెలుగుకు దారి చూపుతుంది.. చైతన్య దీప్తిని రగిలిస్తుంది.. జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుంది.. కోటి దీపాలు మిల మిలా వేడుక దీపావళి.. గురువారం దివాళి పండుగ జరుపుకోవడానికి ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. యువత, చిన్నారులు బాణసంచా కాల్చడానికి ఎదురుచూస్తున్నారు. మహిషాసుర మర్దిని నరకాసురుడుని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు జరుపుకొనేది, లంకలో రావణుని సంహరించి శ్రీరాముడు సతీమసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు జరుపుకొనే పండుగ దీపావళి అని ఇతిహాస గాథలు చెప్తున్నాయి. పండుగ రోజున దీపాలు వెలిగిస్తే మానవాళికి తేజస్సు వస్తుందని పురాణగాథలు వెల్లడిస్తున్నాయి. ఆడపడుచులు సోదరులకు మంగళహారతులిసేక్త ఐైష్టెశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. అలాగే ప్రత్యేకంగా భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. దీప దానం, దీపారాధన చేస్తారు. నీటిలో గంగ ఉంటుందనే నమ్మకంతో బ్రహ్మీ ముహూర్తంలో పవిత్రస్నానం ఆచరిస్తారు. ఖండాంతరాలకు ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వెళ్లిన వారు కూడా దీపావళి పండుగను జరపుకోవడానికి సిద్ధమయ్యారు. సప్త సముద్రాలు దాటినా మన తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, సంప్రదాయాలను మరచిపోలేదు. సామాజిక మాధ్యమాల్లో వీడియో కాల్స్ ద్వారా, మీమ్‌ల ద్వారా ఇప్పటికే శుభాకంక్షల వెల్లువ మొదలైంది.
ఖమ్మం నగరంలో..
దీపావళి అంటేనే పటాకుల చప్పుళ్లు.. చిన్నారుల కేరింతలు.. కానీ కొవిడ్ కారణంగా దీపావళి రోజు పటాకులు సరిగా పేలలేదు. ఈసారి కరనా ఇబ్బందులు తప్పడంతో పటాకులు కాల్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ్యాపారులు 106 దుకాణాలు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. బుధవారం మోస్తరు వర్షం కురవడంతో రెండో రోజు కూడా విక్రయాలు అంతగా లేవు. పండుగ రోజైన గురువారమే భారీ విక్రయాలు ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన వీధుల్లో విక్రయదారులు బుధవారం రకరకాల డిజైన్లలో ప్రమిదలు విక్రయించడం కనిపించింది. కమాన్‌బజార్, కస్బాబజార్, కవిరాజ్‌నగర్ షాపిం గ్మాల్స్లో పండుగ సందర్భంగా సందడి నెలకొన్నది.
కొత్తగూడెంలో సందడి..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం పండుగ సందడి కనిపించింది. కొత్తగూడెంలోని బస్టాండ్, పాత సెంటర్ ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. వ్యాపార సముదాయాల్లో నూతన వస్ర్తాలు కొంటూ, తోపుడు బండ్లపై ప్రమిదలు కొంటూ పట్టణవాసులు కనిపించారు. రాజస్థాన్, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన రకరకాల డిజైన్స్ ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విక్రయదారులు సైజ్‌ను బట్టి ఒక్కో ప్రమిదను రూ.10 నుంచి రూ.200 వరకు విక్రయించారు. పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన పటాకుల స్టాళ్ల వద్ద సందడి కనిపించింది.