
సత్తుపల్లి, నవంబర్ 3 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్ని గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే తెరిచి, మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఈ నెల 7న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోలుకు ఎన్ని అవాంతరాలు సృష్టించినా సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేయనున్నారని అన్నారు. రైతులు ధాన్యాన్ని తేమశాతం లేకుండా పూర్తిస్థాయిలో ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.