
టీఆర్ఎస్ పార్టీ ఒక మహాసముద్రం
దేశం చూపు.. సీఎం కేసీఆర్ వైపు..
కార్యకర్తలను కనిపెట్టుకొని ఉండేది టీఆర్ఎస్సే
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
మధిరలో సంస్థాగత ఎన్నికల సభ్యుల ప్రమాణస్వీకారం
బోనకల్లు/మధిర రూరల్, అక్టోబర్ 3 : టీఆర్ఎస్ పార్టీ ఒక మహా సముద్రమని, గులాబీ కంచుకోటను ఎవరూ ఢీకొనలేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో ఎంపికైన మధిర నియోజకవర్గంలోని సభ్యులతో పట్టణంలో టీవీఎం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ నాడు కమ్యూనిస్టులను ఈ జిల్లా ప్రజలు మోశారని, తర్వాత కాంగ్రెస్, టీడీపీ పార్టీలను మోసి అందలమెక్కించారని అన్నారు. మళ్లీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ను మోసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్కసారి ఓ పార్టీని నమ్మితే ఆ పార్టీ వైపే మొగ్గుచూపుతారన్నారు. దీనిలో భాగంగానే ఈసారి జిల్లా ప్రజానీకం టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతోందని అన్నారు. 2023లో కూడా మూడోసారి సీఎం కేసీఆర్‌ను గద్దెనెక్కించే క్రమంలో ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలనూ గెలిచి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామాల్లోకి ఎవరు వచ్చినా వారిని గౌరవించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను అధినాయకత్వం గుర్తిస్తుందన్నారు. కేటీఆర్ లాంటి మంత్రి ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని ప్రతిపక్ష నేతలే బహిరంగంగా అభినందిస్తున్నారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో ఈ రాష్ర్టానికి కేటీఆర్ దిక్సూచిలా ఉంటారని అన్నారు. మధిరలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం..: ఎంపీ నామా
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర మంత్రులే స్వయంగా అభినందిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని, వాటిని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి చెప్పారని అన్నారు. పదవులు ముఖ్యం కాకుండా.. ప్రజలే ముఖ్యమని భావించి పనిచేసే వారికి టీఆర్ఎస్లో తప్పక గౌరవం దక్కుతుందన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐకమత్యంగా పనిచేసి జిల్లాలో టీఆర్ఎస్ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ను గెలిపించుకోవాలి: నరేశ్‌రెడ్డి
జరగబోయే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ను ఎన్నుకోవడం కోసం రాష్ట్ర ప్రజలు ముందుండాలన్నారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులే రాబోయే ఎన్నికల్లో బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఐక్యమత్యంగా పనిచేయాలి: కొండబాల
పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా పనిచేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సూచించారు. మధిర నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రతి కార్యకర్తా మంచి సంకల్పంతో ముందుకు సాగినప్పుడే విజయం సాధ్యమవుతుందని అన్నారు. టీఆర్ఎస్ జెండా ఎగరాలంటే ప్రజలకు విశ్వాసం మరింత పెరిగేలా కార్యకర్తలు, నాయకులు పథకాలను వివరించాలన్నారు.
ప్రగతి పథంలో తెలంగాణ: పొంగులేటి
తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్తా ముందుండాలన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కేవలం ఖమ్మం అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలిచారన్నారు. ఆయనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతరం కోసం ఎవరు వచ్చినా గౌరవించుకోవాలన్నారు. పార్టీ కోసం పని చేసేందుకు ముందుంటానని, జరగబోయే ఎన్నికల్లో తనవంతు బాధ్యతగా కృషిచేస్తానని అన్నారు. ఎన్నికైన కొత్త కమిటీలు మంచిగా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు.
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం: బాలసాని
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకూ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, పట్టణ స్థాయి వరకూ అన్ని కమిటీలనూ విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ జెండా ఎగరడమే లక్ష్యం: కమల్‌రాజు
మధిరలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురడమే లక్ష్యమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అధిష్ఠానం పిలుపు మేరకు కమిటీలను పూర్తిచేసుకొని పార్టీ ఒక రాజకీయ శక్తిలా ఎదిగిందన్నారు. దీనికి అనుగుణంగా తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అప్పగించి నాయకత్వాన్ని నడిపించేలా అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ, 4 మండల పరిషత్, 4 జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు 85 పంచాయతీలకు పైగా టీఆర్ఎస్ గెలుచుకొని మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మల్లాది వాసు, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీలు మొండెం లలిత, దేవరకొండ శిరీష, సామినేని హరిప్రసాద్, కోవూరి పూర్ణయ్య, జడ్పీటీసీలు పర్సగాని తిరుపతికిషోర్, పసుపులేటి దుర్గ, శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, పంబి సాంబశివరావు, యన్నం శ్రీనివాసరెడ్డి, దాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, పెంట్యాల పుల్లయ్య, బొడ్డు వెంకటరామారావు, రైతుబంధు సమితి కన్వీనర్లు వేమూరి ప్రసాద్, శీలం వెంకట్రామిరెడ్డి, పోట్ల ప్రసాద్, చావా వేణు, కిలారి మనోహర్‌బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ..
సంస్థాగత కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకార సందర్భంగా మధిర నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి 10 వేల మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా భారీ ర్యాలీగా తరలివచ్చారు. మధిర పట్టణమంతా గులాబీమయమైంది. అనంతరం మంత్రి అజయ్ స్థానిక వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. మంత్రికి డప్పువాయిద్యాలతో కళాకారులు ఊరేగింపు నిర్వహించారు. నృత్య కళాకారులు మంత్రికి పూలుచల్లుతూ ఘనస్వాగతం పలికారు.