
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ
మహిళల శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగిస్తున్న కేసీఆర్
పండుగ పూట ఆడబిడ్డలంతా కొత్త దుస్తులు కట్టుకోవాలి
బతుకమ్మ సారె పంపిణీలో మంత్రి అజయ్‌కుమార్
రఘునాథపాలెం, అక్టోబర్ 3: రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డా దసరా పండుగ రోజున కొత్త దుస్తులు కట్టుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్లుగా బతుకమ్మ సందర్భంగా చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెంలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. పండుగ వాతావరణంలో బతుకమ్మ సారెను స్వయంగా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ అయిన దసరా సందర్భంగా జరుపుకునే ‘బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు ఎంతో ప్రాధాన్యం కలిగిన బతుకమ్మ సందర్భంగా చీరెలను సారెగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరెలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిరిసిల్ల చేనేత కార్మికులతో 254 పైగా ఆకర్షణీయమైన డిజైన్లతో నాణ్యమైన చీరెలను నేయించినట్లు చెప్పారు.
మహిళల కోసం అనేక పథకాలు..
మహిళల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలకు ఎంతో ఆదరణ లభిస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను పంపిణీ చేస్తున్నామని, 4.27 లక్షల చీరెలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రఘునాథపాలెం మండలంలో 16 వేల చీరెలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహిళలకు నచ్చిన చీరెను ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మంత్రి స్వయంగా మహిళలకు బతుకమ్మ సారెను అందజేశారు. చీరెలను అందుకునే సమయంలో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సర్పంచ్ గుడిపుడి శారద అధ్యక్షత వహించగా.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, ఎంపీపీ గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరూనాయక్, మహిళా అధ్యక్షురాలు బానోతు ప్రమీల, తహసీల్దార్ నర్సింహారావు, కార్యదర్శి ప్రసన్నకుమార్, ఉప సర్పంచ్ కుందేసాహెబ్, టీఆర్ఎస్ నాయకులు గుడిపుడి రామారావు, నంద్యా, గిర్దావర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.