
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వీలునామా, సొసైటీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లకూ వర్తింపు
ఖమ్మం (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) సెప్టెంబర్ 3: రిజిస్ట్రేషన్‌శాఖ పరిధిలో అమలవుతున్న ఫీజులను సవరిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 22వ తేదీన భూముల విలువ, స్టాంప్ డ్యూటీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం ఫీజులను సవరించగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఫీజులను సవరించింది. క్రయ విక్రయాలకు సంబంధించిన ఫీజులను మాత్రం యథావిధిగానే ఉంచింది. ఈసీకి గతంలో రూ.200 ఫీజు ఉండగా రూ.500కు, సర్టిఫై కాపీకి గతంలో రూ.200 ఫీజు ఉండగా రూ.500కు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్‌కు గతంలో రూ.10 ఉండగా రూ.100కు, రిజిస్ట్రేషన్ సమయంలో యూజర్ ఛార్జీ రూ.100 ఉండగా రూ.500కు, 15 పేజీలకు మించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు ఫీజు పెంచింది. వీలునామాకు గతంలో రూ.వెయ్యి ఉండగా ప్రస్తుతం రూ.3 వేలకు పెంచింది. దుకాణదారుల కిరాయినామా 0.1 శాతం ఉండగా 0.2 శాతానికి, లీగల్ ఒపీనియన్ గతంలో రూ.200 ఉండగా రూ.500కు పెంచింది. ఇవేకాక జిల్లా రిజిస్ట్రార్ చేసే సొసైటీల రిజిస్ట్రేషన్ ఫీజులనూ పెంచింది. బహుమతి రిజిస్ట్రేషన్ ఫీజులనూ సవరించింది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా కనీసం రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.25 వేలకు పెంచింది.
పెరుగుతున్న ఆదాయం..
ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాల్లో గురువారం నుంచి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఫీజులు అమలవుతున్నాయి. కొత్త ఫీజుల ప్రకారం వినియోగదారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. గురువారం ఏకాదశి కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. సవరించిన ఫీజుల ప్రకారం రిజిస్ట్రేషన్‌శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఆ శాఖ 15 పేజీలకు మించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న వాటికి రూ.వెయ్యి, 15 పేజీలు లోపు ఉన్న వాటికి రూ. 500 వసూలు చేసింది. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం ప్రభుత్వం పాత విధంగానే అమలు చేస్తున్నది.
సవరించిన ఫీజులతోనే సేవలు..
రిజిస్ట్రేషన్‌శాఖలో ప్రభుత్వం ఫీజులు పెంచిన విధంగా అమలవుతాయి. ఈ నెల 2వ తేదీ నుంచి కొత్త ధరలు అమలవుతాయి. వినియోగదారులు గమనించాలి. డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్‌కు యూజర్ ఛార్జీ కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.వెయ్యి వసూలు చేస్తాం. అలాగే విలునామా, గిఫ్ట్ రిజిస్ట్రేషన్, సొసైటీ రిజిస్ట్రేషన్ వంటి సేవల రుసుము పెరుగుతుంది.
-రవీందర్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఖమ్మం