
లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగి పొర్లిన వాగులు, వంకలు
కొత్తగూడెంలో అత్యధికంగా 125.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కొత్తగూడెం, సెప్టెంబర్ 3 : భద్రాద్రి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. సుమారు రెండుగంటల పాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. చుంచుపల్లిలోని విద్యానగర్కాలనీ పంచాయతీ సారయ్య కాలనీ, రామాంజనేయకాలనీల్లో వరదనీరు రోడ్లపై ప్రవహించింది. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్, కొత్తగూడెం మున్సిపాలిటీలోని ప్రధాన డ్రైనేజీ ఉధృతంగా పొంగి ప్రవహించడంతో ఇళ్లల్లోకి భారీగా వరదనీరు చేరింది. పంట పొలాల్లోకి వరదనీరు భారీగా వచ్చింది. కొత్తగూడెంలోని మొర్రేడువాగు, గోధుమవాగు, కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహించాయి. గొల్లగూడెం పాఠశాలకు విధులకు హాజరైన ఉపాధ్యాయుడు వాగును దాటాల్సి వచ్చింది. గ్రామస్తులు ఉపాధ్యాయుడి చేయి పట్టుకొని దాటించారు. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు రాకపోకలు సాగించలేదు.
కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 3 : కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి శుక్రవారం ఒక గేటు ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి మండలాల్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో వరదనీరు కిన్నెరసానిలో వచ్చి చేరింది. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా, 405.6 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 10వేల క్యూసెక్కులు ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఒక గేటును ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. రాజాపురం లో లెవల్ వంతెనపై నుంచి కిన్నెరసాని ప్రవహిస్తూ ఉండడంతో యానంబైలు అవతల ఉన్న పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం వద్ద బూడిదవాగు పొంగి ప్రవహించింది. దీంతో సూరారం అవతల ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.