
దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
రాముడి సన్నిధిలో భాగవత సప్తాహం నిర్వహించడం అభినందనీయం
శ్రీత్రిదండి చిన జీయర్ స్వామి
భద్రాచలం, సెప్టెంబర్3 : తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం భద్రాచలం జీయర్ మఠంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారమ్మ సన్నిధిని దర్శించుకున్నారు. చిత్రకూట మండపంలో శ్రీమద్భాగవత సప్తాహం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పితృవాక్య పరిపాలకుడైన రాముడి సన్నిధిలో భాగవత సప్తాహం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా సుఖ, సంతోషాలతో జీవించాలన్నారు. మానవుడు ఎలా ఉండాలో.. రామావతారంలో శ్రీరాముడు ఆచరించి చూపారన్నారు. భద్రాద్రి రామయ్యను సేవించే భాగ్యం దక్కడం అదృష్టమని పేర్కొన్నారు. దేశం, రాష్ర్టాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఉదయం జీయర్ మఠంలో పెరుమాళ్‌కు పూజలు చేశారు. భక్తులకు తీర్థగోష్టి నిర్వహించి మంత్రోపదేశం చేశారు. భక్తులు సమర్పించిన జనరేటర్‌ను ఆవిష్కరించారు. సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం, దీపారాధన, వేద విద్యార్థులతో వైదిక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీఅహోబిల రామానుజ జీయర్ స్వామి, శ్రీమాన్ సముద్రాల వెంకటరంగ రామానుజ స్వామి, దేవస్థానం ఈవో బానోత్ శివాజీ పాల్గొన్నారు.