
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 2: అంతరించిపోతున్న అడవులను రక్షించి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతిఒక్కరూ చెట్లను నాటి ప్రకృతికి తమవంతు సహకారం అందించాలని సీఐ రమాకాంత్ అన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా శనివారం వేంసూరు రోడ్డులోని అర్బన్ పార్కులో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన 1000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పచ్చనిచెట్లను ప్రగతికి మెట్లుగా భావించాలన్నారు. మానవాళి భద్రతకు చెట్లే రక్షణగా నిలుస్తాయని స్పష్టం చేశారు. రానున్న కాలంలో చెట్లు లేకపోతే ఆక్సిజన్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటేందుకు కృషిచేయాలని సూచించారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముత్యాలరావు, ఏఎస్సై ప్రతాపరెడ్డి, సిబ్బంది గోపాల్, కరుణాకర్, రామకృష్ణ, కాలేషా పాల్గొన్నారు.