
గ్రామాలు, పట్టణాలు, నగరంలో గులాబీ జెండాల రెపరెపలు
ఊరూరా టీఆర్ఎస్ పతాక ఆవిష్కరణలు
ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలు
ర్యాలీలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఖమ్మం, సెప్టెంబరు 2 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : విను వీధుల్లో గులాబీ సైన్యం కదం తొక్కింది. పల్లె, పట్టణం టీఆర్ఎస్ జెండాలతో రెపరెపలాడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన గులాబీ జెండా పండుగ ఉత్సవంలా సాగింది. ఉద్యమ గుమ్మం గులాబీమయమైంది.. మోటారుసైకిల్ ర్యాలీలు, భారీ ప్రదర్శనలు, సభలు, సమావేశాలతో సందడి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామగ్రామాన, వీధివీధినా టీఆర్ఎస్ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యాచరణ రూపొందించారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీ కోసం సైనికుల్లా పని చేస్తామని కార్యకర్తలు ప్రతినబూనారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామగ్రామాన, వీధివీధినా టీఆర్ఎస్ పతాకం రెపరెపలాడింది. మోటారుసైకిల్ ర్యాలీలు, భారీ ప్రదర్శనలు, సభలు, సమావేశాలతో సందడి నెలకొన్నది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. తల్లాడ, కల్లూరు మండలాల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం మోటారుసైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మేయర్ కునుకొల్లు నీరజ, నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళీ, పలువురు కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో పర్యటించి పలు గ్రామాల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వైరా నియోజకవర్గంలో పలు మండలాల్లో, గ్రామాల్లో పార్టీ సర్పంచ్‌లు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వైరాలో మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం కనుల పండువగా జరిగింది.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పలు ప్రాంతాల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. అశ్వారావుపేటలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పినపాక నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో జెండా పండుగలు ఘనంగా జరిగాయి. ఇల్లెందులో పట్టణ అధ్యక్షుడు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల్లో పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.