
ఎంఈవోల వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
జాతీయ రహదారుల పనుల పురోగతిపైనా అధికారులతో సమీక్ష
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 2: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరును వంద శాతానికి పెంచాలని, ఈ మేరకు విద్యాశాఖాధికారులు రెండు రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల హాజరుపై మండల విద్యా శాఖాధికారులతో గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, కొవిడ్ నిబంధనలతోనే విద్యా బోధన జరుగుతోందని వివరించాలని సూచించారు. అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు డోసుల కొవిడ్ టీకా వేయించుకొని ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ బాధ్యులు కూడా టీకా వేసుకోవాలన్నారు.
ఎన్హెచ్ పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో జాతీయ రహదారుల పనులకు సంబంధించి అనుబంధ శాఖల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించి జిల్లాలో జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, అటవీ, ల్యాండ్ సర్వే, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.