పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించాలి
వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి పర్యటనలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన
హాజరైన ఉన్నతాధికారులు ప్రియాంకా వర్గీస్, కరుణ, దివ్య
కొత్తగూడెం/ సుజాతనగర్/ భద్రాచలం, సెప్టెంబర్ 2: పౌష్టికాహార లోపంతో బాధపడుతున చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. భద్రాద్రి జిల్లా మండలం సర్వారం అంగన్వాడీ కేంద్రాన్ని, పీహెచ్‌సీని గిరిజన సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చాంగ్తూ, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యలతో కలిసి స్మితా సబర్వాల్ గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందజేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, డీడబ్ల్యూవో వరలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ సరళ, డాక్టర్ రవిబాబు పాల్గొన్నారు.
జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్ తనిఖీ
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్‌ను కూడా వారు పరిశీలించారు. మారుమూల ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు అందిస్తున్న అభినందనీయమని ప్రశంసించారు. మంచి సేవలు అందిస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. పాలియేటీవ్ కేర్ యూనిట్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. నిరాదరణకు గురై అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
కార్పొరేట్ స్థాయి వైద్యం
మారుమూల ప్రాంతాలున్న భద్రాద్రి జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా, సీఎంవో ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణతో కలిసి గురువారం ఆమె భద్రాచలంలోని క్షయ నివారణ కేంద్రాన్ని, ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. తొలుత శిశు గృహను సందర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం పర్యటనకు వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా చోంగ్తూ ఆదివాసీలు తయారు చేసిన చెక్క బొమ్మలను ఆసక్తిగా పరిశీలించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని ఆమె తిలకించారు.