
కొవిడ్ నిబంధనలు, పోలీసు తనిఖీలతో ప్రశాంతంగా సంబురాలు
ఖమ్మం కల్చరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలు ఉమ్మడి జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ప్రతి ఇంట్లోనూ న్యూ ఇయర్ కేక్ కటింగ్‌లు, స్వీట్ల పంపిణీ వంటివి పండుగలా జరిగాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజలు ఆనందోత్సాహాలతో గడిపారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసుల తనిఖీలు నిర్వహించారు. దీంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల బాధ్యులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. ఈ-మెయిల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మెసేజ్‌లతో బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అందుబాటులో లేని శ్రేయోభిలాషులకు ఆన్లైన్లో శుభాకాంక్షలు చెప్పి ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ భవన్లో నూతన వేడుకలు ఘనంగా జరిగాయి. కమాన్‌బజార్ లేడీస్ హాస్టల్, ఫైవ్ ఎలిమెంట్స్ అపార్ట్మెంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో యువత సంబురాలను నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి పలు చర్చీల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. విశ్వాసులు క్రీస్తు ప్రార్థనలు చేశారు. భక్తి గీతాలు ఆలపించారు. శనివారం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తమతమ ఇష్ట దైవాలను దర్శించుకొని ఈ సంవత్సరమంతా శుభప్రదంగా ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు.
మంత్రి కేటీఆర్‌కు అజయ్ శుభాకాంక్షలు
ఖమ్మం, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. శాలువాతో సత్కరించారు. ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైన సందర్భంగా ఆయనను సాదరంగా జిల్లాకు ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.