
టాస్క్‌తో యువతకు ఉద్యోగావకాశాలు
సాంకేతిక, సాధారణ డిగ్రీ కోర్సుల్లోనూ అమలు
రాబోయే ఏడాది నుంచి ఫార్మా శిక్షణకు సన్నాహాలు
ఖమ్మం జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;గ్రామీణ యువతీ యువకుల ఉపాధికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. నైపుణ్యాభివృద్ధికి చేయూతనిస్తున్నది. వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నది. సాంకేతిక విద్యతోపాటు ఇతర కోర్సులు చదివిన విద్యార్థులకూ బాసటగా నిలుస్తున్నది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాస్క్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర సాంకేతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ప్రారంభించింది. ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం దీన్ని స్థాపించారు. ఇప్పటి వరకు 15,017 మంది టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 5,800 మందికిపైగా ఉద్యోగాలు పొందారు. ఒక్క ఐటీ హబ్‌లోనే 500 మందికి ప్లేస్‌మెంట్స్ కల్పించారు. అంతకు ముందు టాస్క్ ద్వారా 1,200 మందికిపైగా ఉద్యోగావకాశాలు లభించాయి. మరో 4,500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందేలా దోహదపడింది. అంతేకాదు, ఫార్మా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాస్క్ అడుగులు వేస్తోంది.
ఖమ్మం జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;టాస్క్ ద్వారా శిక్షణ, ప్లేస్‌మెంట్స్ పొందాలంటే ఆయా కళాశాలలు, విద్యార్థులు టాస్క్‌లో నమోదు చేసుకొని ఉండాలి. ఇప్పటికే 2021-22 విద్యాసంవత్సరానికి టాస్క్ కళాశాల, విద్యార్థుల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా కళాశాలల విద్యార్థులు టాస్క్‌లో నమోదు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అప్పుడు విద్యార్థులకు శిక్షణ నిర్వహించి కంపెనీ ప్లేస్‌మెంట్స్‌లో అవకాశం కల్పిస్తారు. ఈ నెల 22వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. టాస్క్‌లో విద్యార్థులు ఒకసారి నమోదు అయితే సంబంధిత కోర్సు ముగిసే వరకు వారి రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. శిక్షణతోపాటు టాస్క్ ద్వారా జరిగే కంపెనీల ప్లేస్‌మెంట్స్‌కు అర్హత పొందుతారు. కంపెనీల ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని టాస్క్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ విద్యార్థులకు ఆయా కంపెనీల వివరాలను తెలియజేస్తారు.
నైపుణ్యాభివృద్ధి రస్తు ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసీ ఇతర కోర్సుల వారికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు.
వ్యక్తిగత నైపుణ్యం, విషయ, సంస్థాగత నైపుణ్యాలు పెంపొందిస్తారు.
మారుతున్న సాంకేతిక అంశాలకు అనుగుణంగా దశలవారీగా ఆన్లైన్లో ఆయా కళాశాలల్లోనే కార్యాశాలలు ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలు కోరుకునే మానవ వనరులను విద్యార్థుల్లో పెంపొందించి ఉద్యోగాలు సాధించేలా చేస్తుంది.
కంపెనీల ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తుంది.
ఐటీ హబ్‌తో అవకాశాలు
టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఖమ్మంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ హబ్‌లో మొదటి ఫ్లోర్లో టాస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ హబ్‌లోని కంపెనీలతో సమన్వయం చేస్తూ యువత, విద్యార్థులకు శిక్షణ నిర్వహించి ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తున్నారు.
కరోనా కాలంలోనూ తరగతుల నిర్వహణ
కొవిడ్ కారణంగా కొన్ని నెలలు ఆన్లైన్లో విద్యార్థులకు శిక్షణ కల్పించారు. గ్రామీణ కళాశాలల్లో ప్రస్తుతం ఆన్లైన్లో తరగతులు జరుగుతున్నా.. మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీస్‌కు అనుకూలంగా లేవు. దీంతో విద్యార్థులకు టాస్క్ ఒక వేదికగా నిలుస్తుంది. ఆన్లైన్ ద్వారా ఇతర కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, బ్లాక్ చైన్, ఐవోటీ, డాటా ఆనలిటిక్స్, ఆధునిక టెక్నాలజీస్‌ను గూగుల్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, సిస్నోవంటి కా ర్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఆయా కంపెనీల సహకారంతో అధికారిక శిక్షణను విద్యార్థులకు అందజేస్తున్నారు.
5,800 మందికిపైగా ఉద్యోగాలు..
తొలుత కళాశాలలు టాస్క్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఖమ్మం జిల్లాలో 42 విద్యాసంస్థలు టాస్క్‌తో అనుసంధానమయ్యాయి. వీటిటో 8 పాలిటెక్నిక్ కళాశాలలు, 23 డిగ్రీ కళాశాలలు, 11 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి టాస్క్‌లో ఇప్పటి వరకు 15,017 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5,800 మందికిపైగా ఉద్యోగాలు కల్పించారు. ఒక్క ఐటీ హబ్‌లోనే 500 మందికి ప్లేస్‌మెంట్స్ కల్పించారు. అంతకు ముందు ఒక్క టాస్క్ ద్వారానే 1,200 మందికిపైగా ఉద్యోగావకాశాలు పొందారు. తర్వాత ఇతర కంపెనీలతో మాట్లాడుతూ మరో 4,500 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందేందుకు టాస్క్ దోహదపడింది. టాస్క్‌తో ప్రస్తుతం 350కిపైగా కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. వీటి ద్వారా ఆన్‌లైన్‌లోనూ ప్రాంగణ నియమాకాలు చేపట్టారు.
ఫార్మా శిక్షణ దిశగా అడుగులు..
ఫార్మా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాస్క్ అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరంలో ఫార్మా శిక్షణకు శ్రీకారం చుట్టనున్నది. విద్యార్థులకు ఏఏ అంశాలలో శిక్షణ ఇవ్వాలి. దీనిలో కంపెనీలను భాగస్వామ్యం చేసే అంశాలపై టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా ఆధ్వర్యంలో సన్నద్ధం చేస్తున్నారు.
ఉద్యోగావకాశాలే టాస్క్ లక్ష్యం
తెలంగాణలో వివిధ దశల్లో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ‘కొలువు’ సాధించడానికి అద్భుతమైన వేదిక టాస్క్. యువత ఉద్యోగాలు సాధించేందుకు మెళకువలు, నైపుణ్యాలు పెంపొందిస్తాం. వారి భవిష్యత్‌కు భరోసా కల్పించే అవకాశం తెలంగాణలోనే ఉంది. డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుత ఐటీ మార్కెట్‌కు సంబంధించిన కోర్సులకు ఎలాంటి ఫీజులు లేకుండానే విద్యార్థులకు ఉచితంగా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో లోకల్‌గా ఉండే కంపెనీల ప్రతినిధులతో చర్చించి వారికి అవసరమైన నిపుణులను అందించనున్నాం. నిపుణులుగా తీర్చిదిద్దిన తర్వాత విద్యార్థులను ఆయా సంస్థలకు అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు పెంచుతాం. రాజధానిలోనే కాకుండా జిల్లాస్థాయిలోనూ మెగా జాబ్ మేళాలను నిర్వహించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.