
రేపటి నుంచి భద్రాద్రిలో ముక్కోటి అధ్యయనోత్సవాలు
భక్తజన సంద్రం కానున్న భద్రగిరి
పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
దశావతారాల్లో రామయ్య దర్శనం..
12న తెప్పోత్సవం
13న ఉత్తర ద్వార దర్శనం
భద్రాచలం, జనవరి 1 ;భక్తులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న మధుర క్షణాలు రానే వచ్చాయి. అపురూపమైన భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగే ముక్కోటి అధ్యయనోత్సవాలకు వేళైంది. శ్రీరామచంద్రుడి ముగ్ధ మనోహర రూపాన్ని వీక్షించే అమృత ఘడియలు సమీపించాయి. సోమవారం ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో ఆలయ అధికారులు, అర్చకులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య ఉత్తర ద్వార దర్శనానికి ఇప్పటికే ఆన్లైన్/ఆఫ్ లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.
శ్రీవైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనది. సకల జగత్తుకు సృష్టి, స్థితి, లయ కారకుడైన శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం. ఆ తరువాత వచ్చే శుద్ధ ఏకాదశే శ్రీవైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోని, సర్వ దివ్య మంగళ విగ్రహంతో ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యాన్ని కలుగజేస్తాడు. దేవతలు శ్రీహరిని సేవించుకునే రోజుకే ముక్కోటి ఏకాదశి అని పేరు. భద్రాద్రి శ్రీసీతారా మచంద్రస్వామి ఆలయంలో 21 రోజులు పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రామయ్య ఒక్కో రోజు ఒక్కో విధంగా దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం, 29న విశ్వరూప దర్శనానికి చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
3న మత్స్యావతారం : శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాథలు పురాణాల్లో ఉన్నాయి. ఒకటి జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసుడిని సంహరించడానికి మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించాడనేది పురాణ గాథ. రెండోది జలప్రళయం నుంచి నావలో ఉన్న వైవస్వత మనువు, సప్త రుషులు, సృష్టికి అవసరమైన విత్తనాలు, ఔషధాలను విష్ణు రక్షించాడనేది మరోగాథ.
4న కూర్మావతారం :
దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీర సాగర మథనం చేస్తారు. ఈ సమయంలో ఏ ఆధారం లేక మంధర పర్వతం మునిగిపోగా దేవతలు, రాక్షసుల ప్రార్థనపై విష్ణువు కూర్మావతారాన్ని ధరించి పర్వతాన్ని తన వీపున నిలుపుకున్నాడని పురాణ గాథ.
5న వరాహావతారం : ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువుడు విష్ణువు బ్రహ్మాదుల మొర విని నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు.
6 నరసింహావతారం : విష్ణువు ప్రియభక్తుడైన ప్రహ్లాదున్ని అనేక బాధలకు గురి చేస్తున్న హిరణ్యాకశిపున్ని సంహరించడానికి విష్ణువు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాలమైనా భగవంతుడి సర్వవ్యాపకతను తెలుపుతుంది.
7న వామనావతారం : దేవతల సర్వ సంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజు బలి చక్రవర్తి దగ్గరకు శ్రీహరి వామన రూపంలో వెళ్తాడు. మూడు అడుగుల నేలను దానంగా స్వీకరిస్తాడు. ఒక అడుగును భూమిపై, రెండో అడుగు ఆకాశంపై, మూడో అడుగును బలి తలపై మోపి త్రివిక్రముడవుతాడు.
8న పరుశురామావతారం : శ్రీమహా విష్ణువు జమదగ్ని అనే మహర్షికి కొడుకుగా జన్మిస్తాడు. పరుశురాముడు అతని పేరు. దుష్టుడైన కార్త వీర్యార్జునుడిని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసార్లు దండేత్తి సంహరించి పరశురాముడు ధర్మాన్ని స్థాపించాడని గాథ.
9న శ్రీరామావతారం :లోక కంటకులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథ కుమారుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమే శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణే ఉత్తమమైందని, అదే శాశ్వతమైందని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి, చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు.
10న బలరామావతారం : శ్రీహరికి శయనమైన ఆదిశేషుడి అంశంతో అవతరించి ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించిన అవతారం బలరామావతారం. శ్రీకృష్ణుడికి అన్నగా నిలిచి ఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన వాడు బలరాముడు.
11న శ్రీకృష్ణావతారం : దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించి దుష్టుడైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించాడు. ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీత బోధించాడు. మానవ ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారమే శ్రీ కృష్ణావతారం.