
4న ఖమ్మానికి యువ నేత రాక
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పర్యటనను విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ పిలుపు
ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో పర్యటించే తేదీ ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 2న ఖమ్మం రావాల్సి ఉన్నప్పటికీ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2వ తేదీ వరకు విధించిన ఆంక్షల కారణంగా పర్యటన రద్దయిన విషయం విదితమే. అయితే ఈ నెల 4న ఖమ్మానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం వెల్లడించారు. 4న ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. నగరంలో రూ.30 కోట్లతో చేపట్టే గోళ్లపాడు కాలువ ఆధునీకరణ పనులు, రూ.20 కోట్లతో నిర్మించే సూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, ప్రకాశ్‌నగర్‌లో మురుగునీటి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు నిర్మాణానికి, దానవాయిగూడెంలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు. రూ.8.50 కోట్లతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు, పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు లకారం ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిని, ఐటీ హబ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నగరంలో దాదాపు రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి చెప్పారు. రూ.230 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందజేస్తున్నామన్నారు. రూ.70 కోట్లతో గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అందిస్తున్న రూ.100 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు. నగరంలో దాదాపు రూ.200 కోట్లతో 2వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించినట్లు గుర్తుచేశారు. రఘునాథపాలెం మండలంలో రూ.75 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, నగరం నుంచి బోనకల్లు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రూ.70 కోట్లతో ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించామని వివరించారు. నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.