
భద్రాద్రి జిల్లాలో 1,12,957 మంది రైతులకు యాసంగి సాయం
భదాద్రి కొత్తగూడెం, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంటల పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఎకరం, ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్న రైతుల జాబితా ప్రకారం గడిచిన మూడు రోజులకు గాను 1,12,957 మంది రైతుల ఖాతాల్లో రూ.117 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో 1,41,655 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ.215 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న పెద్ద రైతులకు సైతం వెనువెంటనే రైతుబంధు సాయం జమ కానుంది.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఇల్లెందు, జనవరి 1: రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమైందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. మండలంలోని బొజ్జాయిగూడెంలో గ్రామ రైతులతో కలిసి శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండినట్లయిందన్నారు. తాజాగా పంటల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారు ఎంతో ఆనందపడుతున్నారని, ధైర్యంగా సాగుకు కదులుతున్నారని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన అన్నదాతకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మెట్ల కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దర్జాగా వ్యవసాయం..
టేకులపల్లి, జనవరి 1: రైతుబంధుతో రైతుల జీవితాలు మారుతున్నాయని, సాగుకు భరోసా కలుగుతున్నదని చెబుతున్నాడు ఈ రైతు. అప్పు కోసం తిరిగే పరిస్థితుల నుంచి బయటపడ్డామని చెబుతున్నాడాయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడేనికి చెందిన రైతు గంగారపు రమేశ్ మనోగతం ఇదీ..
నేను రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు పంటల పెట్టుబడికి ఇబ్బంది పడేవాళ్లు. అప్పు కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవారు. కమిషన్ కొట్టు వ్యాపారి వద్ద డబ్బు తెచ్చేవారు. విత్తనాలు, ఎరువుల డీలర్ల వద్ద ఉద్దెర పెట్టేవారు. తీరా పంట చేతికి వచ్చాక చేతికందిన డబ్బు అంతా వడ్డీ వ్యాపారులు, కమిషన్ కొట్టు వ్యాపారుల అప్పులు చెల్లించడానికే సరిపోయేవి. డీలర్లకు విత్తనాల ప్యాకెట్లు, ఎరువుల ధరల కంటే ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. వీరంతా తక్కువలో తక్కువ రూ.3 వడ్డీ వసూలు చేసేవారు. ఇవన్నీ ఒకవైపు అయితే మరోవైపు దళారుల వసూళ్లు. ఇక రైతులకు ఏం మిగులుతుంది..? చమటోడ్చి సంపాదించిందంతా అప్పులకే వెళ్లేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులకు మంచి రోజులు వచ్చాయి. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రతి సీజన్లో నాకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందుతుంది. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాడుతుంటే తెలంగాణ వస్తే ఆయన రైతులను బాగు చూసుకుంటాడని రైతులమంతా అనుకున్నాం. అదే నిజమైంది. కేసీఆర్ సార్ రైతులను మంచిగ చూస్తున్నడు. సర్కార్ ఇస్తున్న రూ.20 వేల సొమ్ముతో దర్జాగా వ్యవసాయం చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి రూపాయిని ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు వినియోగిస్తున్నాను. వానకాలంలో పత్తి సాగు చేశాను. మంచి దిగుబడి వచ్చింది. ప్రస్తుతం పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఆదాయం బాగా వస్తుంది.
సేట్ల చుట్టూ తిరిగే పని తప్పింది..
సుజాతనగర్, జనవరి 1:‘నేను 40 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూశా. కానీ రైతుల కోసం ఆలోచన చూసే సీఎంను ఏనాడూ చూడలేదు.’ అం టున్నాడు సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన రైతు నాళం సారయ్య. తనకున్న రెండెకరాల పొలంపై ఇప్పటికీ ఎనిమిదిసార్లు రైతుబంధు సాయం అందుకున్నానని, ఈ సాయంతో ఎన్నో తిప్పలు తప్పాయని చెప్పాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పంటల పెట్టుబడి సాయం ఆయన ఏ విధంగా ఉపయోపగడుతుందో, తన సాగుబాటను అది ఎలా మలుపు తిప్పిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
నా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను గమనించా. రైతులకు ఇలాంటి సాయం ఏ ప్రభుత్వమూ చేయలేదు. సీఎం కేసీఆర్ వచ్చాక రైతుబంధు పథకాన్ని పెట్టారు. తొలి ఏడాదిలో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చారు. తరువాత రైతుబంధు ఇక ఉండదని, బంద్ చేస్తున్నారని చాలామంది తప్పుడు ప్రచారం చేసి భయపెట్టారు. కానీ కేసీఆర్ సారు ఆ సాయాన్ని రూ.5 వేలకు పెంచారు. వానకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నారు. సీజన్‌కు ముందే బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. నాకున్న రెండెకరాల పొలానికి ఏటా రూ.20 వేల రైతుబంధు సాయం వస్తోంది. 30 క్వింటాళ్ల వడ్లను పండిస్తున్నా. రైతుబంధు రాకముందు పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ తిరిగాల్సి వచ్చేది. వాళ్లు అప్పు ఇస్తే పంటను కూడా వాళ్లకే అమ్మేవాళ్లం. ఇప్పుడు ఆ రంది లేదు. నా పంటను నేనే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుంటున్నా.