ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభం
ఏడాదిన్న తరువాత ఉత్సాహంగా బడిబాట పట్టిన విద్యార్థులు
తొలిరోజు తోరణాలు కట్టి స్వాగతం పలికిన టీచర్లు, లెక్చరర్లు
పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో కొవిడ్ నిబంధనల అమలు
స్కూళ్లు, కాలేజీలను తనిఖీ చేసిన కలెక్టర్లు, డీఈవోలు, డీఐఈవోలు
ఖమ్మంలో 35.05 శాతం, కొత్తగూడెంలో 26.33 శాతం హాజరు
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్/ ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 1:ఉమ్మడి జిల్లాలో బుధవారం పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో పాఠశాలలకు మామిడి తోరణాలు, రంగురంగుల కాగితాలు కట్టి అలంకరించారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు స్వాగతం పలికారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల గేటు వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. తరువాతే కాసుల్లోకి అనుమతించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురం పాఠశాలలను కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి జిల్లా సుజాతనగర్ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనమూ అందించారు. భద్రాద్రి డీఈవో సోమశేఖరశర్మ ఇల్లెందు, గుండాల మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, చుంచుపల్లి మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఇంటర్మీడియర్ జిల్లా నోడల్ ఆఫీసర్ సులోచనారాణి సందర్శించారు. ఖమ్మం, వైరా పాఠశాలలను డీఈవో యాదయ్య , పిండిప్రోలు, ముదిగొండ కళాశాలలను డీఐఈవో రవిబాబు సందర్శించారు.
పుస్తకాల బ్యాగులను భుజాన తగిలించుకొని తోటి విద్యార్థులతో సందడిగా, హుషారుగా బడిబాట పట్టారు పాఠశాలల విద్యార్థులు. ఏడాదిన్నరగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు బుధవారం ఉత్సాహంగా వెళ్లి చదువులమ్మ ఒడిలో సేదతీరారు. విద్యార్థుల రాకతో విద్యాసంస్థలు కళకళలాడాయి.
ఖమ్మంలో 35 శాతం హాజరు..
ఖమ్మం జిల్లాలో 35.05 శాతం మంది హాజరైనట్లు డీఈవో ఎస్.యాదయ్య వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 83,373 మంది విద్యార్థులకు గాను 29,224 మంది హాజరయ్యారు. భద్రాద్రి జిల్లాలో తొలి రోజు 26.33 శాతం హాజరు నమోదైంది.
అంగన్వాడీల్లోనూ సందడి..
నిన్న, మొన్నటి వరకు బోసిపోయిన చిన్న బడులు (అంగన్వాడీ కేంద్రాలు) బుధవారం సందడిగా కనిపించాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారాన్ని తీసుకున్నారు. పోషకాహార మాసోత్సవాలు కూడా బుధవారమే ప్రారంభమయ్యాయి. దీంతో కేంద్రాల తీరును పర్యవేక్షించేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ వరంగల్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి ఖమ్మం జిల్లాకు వచ్చారు. సత్తుపల్లిలో పలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) సీహెచ్ సంద్యారాణితో కలిసి సందర్శించారు.
చాలా రోజుల తర్వాత స్కూలుకు పంపా..
చాలా రోజుల తర్వాత పిల్లలను పాఠశాలకు పంపించాం. కొవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లను బాగా సన్నద్ధం చేశారు. ఆరోగ్యంతోపాటు పిల్లలకు చదువు కూడా ముఖ్యమే కాబట్టి స్కూలుకు పంపించాం.
-చిట్టూరి అనిత, విద్యార్థిని తల్లి, చింతకాని