
కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 1 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. గడిచిన వారం రోజుల నుంచి దట్టమైన మేఘాలు అలుముకోవడం, తద్వారా చిరుజల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తున్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో కురిసిన వర్షానికి వీధులన్నీ చిత్తడిగా మారాయి. శివారు కాలనీల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలో పాదాచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. నగరంతోపాటు రఘనాథపాలెం, కామేపల్లి, చింతకాని, ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలయపాలెం మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. ప్రస్తుతం వరి నాట్లు మినహా మిగిలిన పంటల సాగు పూర్తి అయ్యింది. కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయింది. మరో లక్ష ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం
కొత్తగూడెం, సెప్టెంబర్ 1 : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇల్లెందు, కరకగూడెం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మొర్రేడు, గోదుమ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్వంచలో కిన్నెరసాని వాగులో నీరు పెరిగింది. భద్రాచలం వద్ద క్రమేపి గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. రైతుల పంటలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరొచ్చి చేరుతున్నది.