ఖమ్మం, ఏప్రిల్ 21: అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై ఐడీవోసీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం సహాయ రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. గోదాములోని ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ల సహాయ రిటర్నింగ్ అధికారుల ద్వారా స్ట్రాంగ్ రూములకు తరలించినట్లు చెప్పారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో; వైరా అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి వైరాలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో; మధిర సెగ్మెంట్‌కు సంబంధించి మధిరలోని పాలిటెక్నిక్ కళాశాలలో; సత్తుపల్లి సెగ్మెంట్‌కు సంబంధించి సత్తుపల్లిలోని జ్యోతి నిలయం హైసూల్లో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌కు 440 బ్యాలెట్ యూనిట్లు, 440 కంట్రోల్ యూనిట్లు, 497 వీవీ ప్యాట్లు; పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు 359 బ్యాలెట్ యూనిట్లు, 359 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీ ప్యాట్లు; వైరా అసెంబ్లీ సెగ్మెంట్‌కు 312 బ్యాలెట్ యూనిట్లు, 312 కంట్రోల్ యూనిట్లు, 352 వీవీ ప్యాట్లు; మధిర అసెంబ్లీ సెగ్మెంట్‌కు 332 బ్యాలెట్ యూనిట్లు, 332 కంట్రోల్ యూనిట్లు, 375 వీవీ ప్యాట్లు; సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 364 బ్యాలెట్ యూనిట్లు, 364 కంట్రోల్ యూనిట్లు, 411 వీవీ ప్యాట్లు తరలించి భద్ర పర్చనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు.
ఓటరు స్లిప్పులను ఈ 25 నుంచి ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్, సి-విజిల్‌పై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూములను తెరిచేటప్పుడు, మూసివేసేటప్పుడు అభ్యర్థులు ఉండాలని చెప్పారు. ఇందుకోసం వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, తహసీల్దార్లు, పార్టీల ప్రతినిధులు స్వర్ణ సుబ్బారావు (ఆప్), వి.రాజేష్ (బీజేపీ), జి.పున్నయ్య (సీపీఎం), ఎన్.సత్యంబాబు (కాంగ్రెస్), చీకటి రాంబాబు (బీఆర్ఎస్), పాలడుగు కృష్ణప్రసాద్ (టీడీపీ) పాల్గొన్నారు.