సాగులో అధునాతన పద్ధతులకు ప్రాధాన్యం
కరి వేద పద్ధతిలో వరి సాగు చేసి సత్ఫలితాలు
సీఎం కేసీఆర్కు ప్రయోగాత్మకంగా వివరించిన రైతు
ప్రస్తుతం 28 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు
ఈ సేద్యకారుడిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం
పర్ణశాల, ఫిబ్రవరి 12: ఆయనొక ఆదర్శ రైతు.. వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ.. పొద్దున నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు పొలం, చెలకతోనే ఆయన చెలిమి.. సాగులో నూతన ఒరవడి సృష్టించి, కొత్త కొత్త ప్రయోగాలు చేసి, అధిక దిగుబడులు సాధించి.. రైతాంగానికి ఆదర్శంగా నిలవాలనేది ఆయన సంకల్పం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎవుసంలో అధునాతన పద్ధతులపై పరిశోధన చేస్తారు.. స్వయంగా ప్రయోగాలు చేస్తారు.. గడిచిన రెండేళ్లలో 30 ఎకరాల్లో కరి వేద పద్ధతిలో వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. ఈయన సాగును ఆదర్శంగా తీసుకుని మరికొందరు రైతులు 350 ఎకరాల్లో ఇదే పద్ధతిలో సాగు చేపట్టి అధిక లాభాలు గడించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ రైతు కృషిని మెచ్చి తన ఫాం హౌస్కు పిలిపించారు. కరి వేద సాగు గురించి సీఎం ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ రైతు ఎవరో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని బండిరేవుకు చెందిన సాగి శ్రీనివాసరావు. ఆయన ‘సేద్య’ గాథపై ప్రత్యేక కథనం.
అధునాతన పద్ధతులంటే ఆసక్తి..
బండిరేవుకుకు చెందిన సాగి శ్రీనివాసరాజుకు సాగులో అధునాతన పద్ధతులంటే ఆసక్తి. కొనేళ్ల క్రితం సాధారణ పంటలను మూస పద్ధతిలో సాగు చేసి విసుగు చెందారు. సాగులో శ్రమించినంతగా లాభాలు రావడం లేదని గుర్తించారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల్లో విస్తృతంగా పర్యటించి పంటల సాగుపై అధ్యయనం చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి సాగులో మెళకువలు నేర్చుకున్నారు. వ్యవసాయశాఖ అధికారులతో అనేక దఫాలుగా చర్చించారు. కరివేద సాగులో వరి లాభసాటి అని గ్రహించి అనేక ఏళ్లు సాగు చేపట్టారు. ఏజెన్సీలో సాగులో ఒక సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఈయన సాగు పద్ధతుల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 15న తన ఫాం హౌస్కు పిలిపించారు. రైతు శ్రీనివాసరావు ప్రయోగాత్మకంగా కరి వేద సాగు పద్ధతిపై సీఎంకు అవగాహన కల్పించారు. సేంద్రియ పద్ధతిలో పంటల సాగుపై వివరించారు.
ప్రస్తుతం ఆయిల్ పాం సాగు..
ఆయిల్ పాం సాగుపై ప్రభుత్వం రాయితీలు అందిస్తుండడం, ప్రభుత్వమే ఆయిల్ పాం ఫ్యాక్టరీల ద్వారా గెలలు కొనడంపై సాగి శ్రీనివాసరావు ఆకర్షితుడయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వరి స్థానంలో ఇతర పంటలు సాగు చేయాలని సూచించడంతో ఆయిల్ పాం సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం 28 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు ప్రారంభించారు. అంతర పంటలుగా మినుములు, వేరుశనగ వేసి అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈయన తోటలను పరిశీలించిన మరికొందరు రైతులు ఆయిల్ పాం తోటలు పెంచేందుకు మొగ్గు చూపుతున్నారు.
రైతు సంక్షేమ పథకాలకు ఫిదా..
రాష్ట్రంలో అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ పథకాలు, రైతు వేదికలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాయంటున్నారు. రైతు శ్రీనివాసరావు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం గురించి పరితపిస్తారని కొనియాడుతున్నారు. ఏజెన్సీ రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని, సీతమ్మ బరాజ్, ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయాలని కోరానన్నారు. విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.
అధునాతన పద్ధతులు పాటించాలి..
రైతులు పారంపర్య వ్యవసాయ పద్ధతులను విడనాడాలి. సాగులో అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసుకోవాలి. భూమి రకాన్ని బట్టి దానిలో ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలి. ఒకే రకం పంటలతో నష్టపోతామని గమనించాలి. వేర్వేరు పంటలు సాగు చేసి లాభాలు గడించవచ్చని తెలుసుకోవాలి. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రస్తుతం 28 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నానున. అంతర పంటలుగా మినుములు, వేరుశనగ సాగు చేస్తున్నా.
–సాగి శ్రీనివాసరాజు, ఆదర్శ రైతు